త్వరలోనే పర్దీపూర్ లిఫ్ట్ చేపడతాం-- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...

త్వరలోనే పర్దీపూర్ లిఫ్ట్ చేపడతాం-- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...
దేవరకద్ర నియోజకవర్గంలోని వాగులన్నిటి పై చెక్ డ్యామ్ లు నిర్మించడం ద్వారా  నియోజక వర్గాన్ని పారే జీవనదిలా మారుస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.  ఆదివారం ఆయన దేవరకద్ర నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. సిసి కుంట, వడ్డేమాన్, లాల్కోట, పర్డేపూర్ లలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించడంతో పాటు,పల్లమర్రు లో 5 కోట్ల 74 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చెక్  డ్యామ్ కు శంకుస్థాపన చేశారు. అంతేకాక గోప్యానాయక్ తండా నుండి  పర్డే పూర్ వరకు 2 కోట్ల 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే  బి టి రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం పర్డే పూర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  దేవరకద్ర నియోజకవర్గంలోని ఊక చెట్టు వాగుపై ఇదివరకే 9 పెద్ద చెక్ డ్యామ్ లను చేపట్టడం జరిగిందని, ఈ వాగుపై సుమారు 36 కిలోమీటర్ల మేర అవసరమైనన్ని చెక్ డ్యామ్ లు నిర్మించి ఎక్కడి నీటిని అక్కడే సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, నియోజకవర్గం మొత్తన్ని పారే జీవనదిలా మారుస్తామని మంత్రి అన్నారు. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి  పేరూరు లిఫ్ట్ ను మంజూరు చేశారని, సాధ్యమైనంత త్వరగా  పర్డే పూర్ లిఫ్ట్ ను కూడా చేపడతామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.  రైతులు ఎప్పటిలా కాకుండా వినూత్నంగా పంటలు సాగు చేసుకోవడంతో పాటు, అధిక దిగుబడులు పొందేందుకు ఆలోచన చేయాలని అన్నారు. ఈ యాసంగి లో దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం నుండే అత్యధికంగా 52% వరి పండించటం జరిగిందని తెలిపారు. సుమారు 52 లక్షల 99 వేల ఎకరాలలో వరి సాగు చేయడం జరిగిందని అన్నారు .రాబోయే రోజుల్లో వరి పంటను తగ్గించాల్సిన అవసరం ఉందని, వరికి బదులుగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని మంత్రి సూచించారు.   యాసంగి లో వరి వేయకుండా కేవలం వానాకాలం లోనే వేయాలని, అది కూడా సన్న రకాలు మాత్రం వేసేలా రైతులు ఆలోచించాలని అన్నారు.  ఎట్టిపరిస్థితుల్లోనూ వరి లో దొడ్డు రకం  వేయకూడదని,దొడ్డు రకానికి మార్కెట్లో డిమాండ్ లేదని అన్నారునీటి లభ్యత, మార్కెట్లో డిమాండ్ ను బట్టి రైతులు పంటలు సాగు చేయాలని ఆయన కోరారు. ఈ విషయాలన్నీ రైతు వేదికలలో చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కందులకు మంచి డిమాండ్ ఉంటుందని దృష్టిలో ఉంచుకుని రైతులకు సూచించగా 4 లక్షల నుండి 10 లక్షల 80 వేల ఎకరాల్లో  కంది పంట సాగు చేశారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పండించిన కంది ని మద్దతు ధర లేకుండానే ప్రైవేట్ లో అధిక ధరకు విక్రయించడం జరిగిందని తెలిపారు. ఎప్పటికీ కంది పంటకు డిమాండ్ ఒకేలా ఉంటుందని అందువల్ల కంది పంట సాగు చేయడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండించిన పంట అమ్ముడు పోవడమే కాకుండా ఎక్కువ దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని మంత్రి సూచించారు. . ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అంతేకాక స్వల్పకాలిక పంటలపై కూడా దృష్టి పెట్టాలని, 30 నుండి 90 రోజుల్లో పంట చేతికి వచ్చే పంటలు అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు . ఆధునిక పద్ధతులు, యంత్ర పరికరాలు వినియోగించడం ద్వారా వ్యవసాయాన్ని సాగు చేస్తే అత్యధిక లాభాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. రైతు వేదికల ద్వారా వినూత్నంగా ఆలోచించడమే కాకుండా రైతుకు, రైతు పండించిన పంటలకు డిమాండ్ పెరిగెల రైతుబంధు  కో ఆర్డినెటర్లు పని చేయాలని చెప్పారు.
  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు, రైతు బీమా, రైతు బంధు పథకం అమలు చేస్తున్నదని రైతు వేదికల ద్వారా రైతులు కొత్త విషయాలను తెలుసుకొని మంచి లాభాలు పొందాలని అన్నారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిందని   తెలిపారు. ఉచిత విద్యుత్ ,సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు, రైతు బీమా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని, అంతేకాక వృద్ధాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు సహకారం అందిస్తున్నదని, ఒక్క దేవరకద్ర నియోజకవర్గం లోనే 9000 మందికి కల్యాణలక్ష్మి  షాది ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తేలిపారు. రైతు వేదికలలో రైతులు వారానికొకసారి సమావేశమై పంటల సాగు , వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చించుకోవాలని ఆయన తెలిపారు.రామన్ పాడు నుండి   కోయిల్సాగర్ వరకు జీవనదిలా మార్పు చేసేందుకు సాధ్యమైనన్ని చెక్ డ్యాములు  నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు మంత్రి, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు పార్ధీపూర్ చెరువును ఆలుగు ను పరిశీలించారు.  ఈ కార్యక్రమాలలో రైతుబంధు జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్ ,ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, పిఎసిఎస్ అధ్యక్షులు ఉమా మహేశ్వర్ రెడ్డి, ఆర్డిఓ పద్మశ్రీ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు యశ్వంతరావు, డీఎస్పీ శ్రీధర్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి 70 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద  చెక్కులను అందజేశారు.
అంతకుముందు మంత్రి సీసీ కుంట పోలీస్ స్టేషన్ లో సి సి కెమెరాలను ప్రారంభించారు.లాల్ కోట లో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు.