తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను సందర్శించిన ట్రైనీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్...
తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను సందర్శించిన ట్రైనీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్...
స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను సందర్శించేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడెమీ, హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్న 29వ బ్యాచ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ తమ 13 రోజుల అటవీ యాత్రలో భాగంగా తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను చేర్చడం విశేషం. అందులో భాగంగానే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఉమా రాణి అద్వర్యం లో 38 మంది ట్రైనీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఈ రోజు ఉదయం 7 గంటలకు బొటానికల్ గార్డెన్ కు చేరుకున్నారు. వీరికి సాదర స్వాగతం పలికిన గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య గార్డెన్ లో మొక్కలను వాటి శాస్త్రీయ నామాలు, కుటుంబాలు, ఉపయోగాలు, ప్రత్యేకతలను వివరించారు. గార్డెన్ లోని వివిధ విభాగాల్లో గల మొక్కలను వివరించడమే కాకుండా వాటి వల్ల ఇక్కడ వుండే పక్షులు, ఉడుతలు, సీతాకోకచిలుకలకు గల సంబంధాన్ని వివరించారు. వివిధ రాష్ట్రాల నుండి సేకరించిన స్థానీయ, అంతరించి పోతున్న మొక్కలను చూపించి వివరించారు. మొక్కలకు ఏర్పాటుచేసిన QR code ల గురించి వివరించారు. మొక్కలను పెంచాలన్నా, కాపాడాలన్నా ఉద్యోగ విధి మాత్రమే కాక ప్రత్యేక ఆసక్తి ఉండాలని అప్పుడే అనుకున్నది సాదించగలమని ట్రైనీ ఆఫీసర్స్ కు సూచించారు. అలా గార్డెన్ లో తిరుగుతుండగానే కనిపించిన జెర్రిపోతు పామును పట్టుకుని పాముల గురించి వివరించారు. అలాగే నాగుపాము, నీరుగట్టు రకాల పాములను చూపించి వాటి గురించి జాగ్రత్తలు తెలియజేశారు. పాముని పట్టించి చూపించారు. అలాగే అడవుల్లో వుండే వృక్ష జంతు జలాలను గుర్తించే విధానాన్ని తెలిపారు. టీం లీడర్ ఉమా రాణి మాట్లాడుతూ గత 10 రోజులుగా చేస్తున్న అటవీ యాత్ర కంటే ఈ గార్డెన్ లో ఎక్కువ విషయాలను తెలుసుకోవటమే కాక అరుదైన మొక్కలను కళ్లారా చూడటం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్రం ఆకారం లో గార్డెన్ ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ట్రైనీ ఆఫీసర్స్ మాట్లాడుతూ చాలా అద్భుతమైన గార్డెన్ ని చూశామని సుమారు 150 కి పైగా మొక్కల గూర్చి తెలుసుకున్నామని అంతేకాక, అనేక రకాల పంటలను ఓకే చోట చూశామని సంతోషపడ్డారు. ట్రైనీ ఆఫీసర్స్ బృందాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ అభినందించారు.ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి శ్రీనివాసులు, లత, గార్డెన్ కేర్ టేకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.