తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా పొందవచ్చు.... మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్...
తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా పొందవచ్చని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తో కలిసి ఆయన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. తెలంగాణ డయాగ్నిస్టిక్ కేంద్రంలో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలను, మైక్రోస్కోప్ లను, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈనెల 9వ తేదీన తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నిస్టిక్ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ డయాగ్నోస్టిక్ కేంద్రం ఏర్పాటు వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, అధునాతన యంత్ర పరికరాల వల్ల ఒకేసారి 400 నుండి 800 రిపోర్టులు పొందే అవకాశం ఉందని, ముఖ్యంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సి హెచ్ సి లు, ఇతర ఆస్పత్రుల నుంచి రక్త సేకరణ ద్వారా పరీక్షలు నిర్వహించి రిపోర్టులు పొందవచ్చని అన్నారు. పేద ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా అందించేందుకు గాను డియాగ్నిస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. డయాగ్నోస్టిక్ కేంద్రానికి మంచి బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా డయాగ్నస్టిక్ కేంద్రానికి వచ్చే రహదారిని విస్తరించాలని మంత్రి ఆస్పత్రి వర్గాలకు సూచించారు. మున్సిపల్ చైర్మన్ కె. సి. నరసింహులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ ,ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రామ్ కిషన్, ఆర్ఎం ఓ డాక్టర్ జీవన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మెడికల్ కళాశాల డాక్టర్ కిరణ్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.