స్వతంత్ర ఫలాలు అట్టడుగు పేద వర్గాల ప్రజలకు అందాలి."స్వతంత్ర భారత అమృతోత్సవాల" సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు యువతకు పిలుపు

 స్వతంత్ర ఫలాలు అట్టడుగు పేద వర్గాల ప్రజలకు అందాలి."స్వతంత్ర భారత అమృతోత్సవాల" సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు యువతకు పిలుపు.  భారతదేశం స్వాతంత్ర్యం సాధించి వచ్చే ఏడాది నాటికి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా దేశవ్యాప్తంగా "ఆజాదిక అమృత్ మహోత్సవ్ఇండియా75" పేరున 75 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా "స్వతంత్ర భారత అమృతోత్సవాల" పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ ఉత్సవాలలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో "స్వేచ్ఛ పరుగు" ను నిర్వహించటం జరిగింది.  జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు,జిల్లా ఎస్. పి రేమా రాజేశ్వరి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ లు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి  "స్వేచ్ఛ పరుగును" ప్రారంభించారు.    ఈ "స్వేచ్ఛ పరుగు" కలెక్టర్ కార్యాలయం నుండి బయలు దేరి  అంబేద్కర్ కూడలి, తెలంగాణ చౌరస్తా చేరుకున్న అనంతరం పరుగులో పాల్గొన్న వారందరు మానవ హారంగా ఏర్పాటుకాగా వారందరిచేత జిల్లా కలెక్టర్ "స్వతంత్ర భారత  అమృతోత్సవాల" ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డి .ఈ. ఓ కార్యాలయం,ఆర్ అండ్ బి చౌరస్తా  మీదుగా  జిల్లా స్టేడియం వరకు" స్వేచ్ఛ పరుగు" ను నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి  వచ్చే ఏడాదికి  75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఏకత్వం తో  "ఆజాదిక అమృతోత్సవాలను" నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో సైతం ఉదయం 6:30 గంటలకే "స్వతంత్ర భారత అమృతోత్సవాలు" స్వేచ్ఛ పరుగు"తో ప్రారంభమయ్యాయని అన్నారు. ఎంతోమంది త్యాగధనుల కృషి ఫలితంగా ఏర్పడిన స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ఫలాలను అట్టడుగున ఉన్న పేద ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.   ప్రత్యేకించి యువత స్వాతంత్రోద్యమ ఘట్టాలను తెలుసుకొని 200 సంవత్సరాల బ్రిటిష్ వారి  దాస్య శృంఖలాల నుండి బయటపడిన భారతదేశ స్వతంత్ర ఫలితాలు ప్రతి ఒక్క రికి అందేలా చూడటానికి కృషి చేయాలని, అప్పుడే దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులకు నిజమైన నివాళి అర్పించిన వారు అవుతారని యువతకు స్ఫూర్తినిచ్చారు.  జిల్లా ఎస్పీ  రేమా రాజేశ్వరి మాట్లాడుతూ ఎంతో కష్టపడి సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో  అందరూ ఐకమత్యంగా ఉంటూ స్వాతంత్ర ఫలితాలను పొందాల్సిన అవసరం ఉందని అన్నారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ మాట్లాడారు. జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు, యువత, క్రీడాకారులు,  కళాశాల, పాఠశాలల విద్యార్థులు తదితరులు సుమారు వెయ్యి మంది వరకు పాల్గొన్నారు.  జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మోడ్రన్ స్కూల్ విద్యార్థుల, ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థుల బ్యాండ్ బృందం స్వేచ్ఛ పరుగుకు ఆకర్షణగా నిలిచింది.

 సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన దేశభక్తి గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి.   ఈ కార్యక్రమంలో లో జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీనివాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షులు లయన్ నటరాజ్, జిల్లా అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.