సర్కారు భూముల వేలం పాట వద్దు ....
సర్కారు భూముల వేలం పాట వద్దు ....
ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయ అన్వేషణ చేయండి
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తున్న భూమి హామీని నిలబెట్టుకోండి ప్రభుత్వానికి సూచించిన జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ బాలవర్ధన్ గౌడ్
కరోనా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిందని తెలంగాణ ప్రజలకు సాకులను చూపి అత్యంత విలువైన ప్రభుత్వ భూములను బహిరంగ వేలానికి విక్రయించేందుకు కెసిఆర్ ప్రభుత్వం కుట్రపన్నుతోందని మహబూబ్ నగర్ జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్, జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్ల బాల వర్ధన్ గౌడ్ ఆరోపించారు. శనివారం ఆయన జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలోని భూమిలేని పేద ప్రజలకు భూమి కేటాయిస్తానని 2014 లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా కెసిఆర్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణలో ప్రజల బతుకులను బాగు చేయాలి తప్ప.. ఉన్న ప్రభుత్వ ఆస్తులను విక్రయించి తమ కుటుంబ ఖజానాను నింపుకోవడం సరైంది కాదని ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వం బహిరంగ వేలం పాట నిర్వహిస్తే.. కెసిఆర్ కుటుంబానికి చెందిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ భూములు కట్టబెట్టే అవకాశం ఉందనేది ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహం అని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి జిల్లాలో వెయ్యి ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమి ఉండొచ్చని చెబుతుంది.. అలాంటప్పుడు బడుగు, బలహీన, వెనకబడిన వర్గాల భూమిలేని పేద ప్రజల ఒక్కో కుటుంబానికి ఎకరా కేటాయిస్తే.. జిల్లాకు 1000 మంది కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల మంది కుటుంబాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపినట్లు అవుతుంది కదా అని అన్నారు. బంగారు తెలంగాణలో ఆదాయవనరులు పడిపోతుంటే.. అందుకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను సృష్టించాలి తప్పా.. ఉన్న స్థిరాస్తులను విక్రయించి తాత్కాలిక ఉపశమనం పొందాలనుకుంటున్న సీఎం కేసీఆర్ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలవర్ధన్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శాగంటి రఘు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు