సన్న , చిన్న కారు రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమలు,చేతి వృత్తుల వారిని బ్యాంకర్లు ప్రోత్సహించాలి ... మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ...
సన్న , చిన్న కారు రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమలు,చేతి వృత్తుల వారిని బ్యాంకర్లు ప్రోత్సహించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో 2021 -22 సంవత్సరానికి ఉద్దేశించి 4654.22 కోట్ల రూపాయల రుణాల లక్ష్యంతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. జిల్లాలో అనేక మంది సన్న, చిన్న కారు రైతులు,ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎంతోమంది పేదవారు ఉన్నారని, బ్యాంకుల ద్వారా అమలు చేసే వివిధ పథకాల కింద సకాలంలో వారికి ఆర్థిక సహాయం అందించినట్లయితే వారు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని చెప్పారు. పంట రుణాల పంపిణీ ,వ్యవసాయ కాల పరిమితి రుణాలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, విద్యారుణాలు, గృహ రుణాల వంటివాటి విషయంలో ఉదారత్వంతో బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. రైతుబంధుకు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు 230.85 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, 2 లక్షల 2,223 మంది రైతులకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో నిన్నటినుండి జమ అవుతున్నాయని , ఎట్టి పరిస్థితులలో రైతులకు వచ్చిన రైతుబంధు నిధులు ఇతర రుణాలకు జమ చేసుకోకుండా వారు పూర్తిగా పెట్టుబడి పెట్టుకునేందుకు ఇవ్వాలని చెప్పారు . రైతులు ఎలాంటి పంటలు వేస్తే లాభం పొందవచ్చో వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని, ఆ విధంగా రైతులకు అవగాహన కల్పించి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల్ని పండించేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా రైతులఅందరూ వరి సాగు చేయకుండా పత్తి,కంది ,ఆయిల్ తదితర పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసి నిర్వహించాలని ,ఏ గ్రామాలు సందర్శించింది, ఎవరితో మాట్లాడింది అన్ని వివరాలు అందులో పొందుపరచాలని, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యత ఇస్తూ రైతుల ద్వారా నూతన పద్ధతిలో పంటలు సాగు చేయడం నేర్పించాలని చెప్పారు . ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగరాజు, నాబార్డు ఎజిఎం శ్రీనివాస్ ,ఎస్ బి ఐ ఆర్శెట్టి డైరెక్టర్ బి ఎస్ కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన వాహనాన్ని ప్రారంభించారు.