సంక్షోభ సమయంలో మనమంతా ఒక్కటిగా నిలబడి ఒకరికొకరం సహకరించుకోవడం అత్యున్నత విలువలకు నిదర్శనంగా నిలుస్తుంది... జిల్లా ఎస్.పి. శ్రీ రావిరాల వేంకటేశ్వర్లు...
సంక్షోభ సమయంలో మనమంతా ఒక్కటిగా నిలబడి ఒకరికొకరం సహకరించుకోవడం అత్యున్నత విలువలకు నిదర్శనంగా నిలుస్తుందని జిల్లా ఎస్.పి. శ్రీ రావిరాల వేంకటేశ్వర్లు అన్నారు. కరోనా నివారణ విధుల్లో నిర్విరామంగా పని చేస్తున్న పోలీసు సిబ్బంది కొరకై రెండు వేల కూల్ కాఫీ పాకెట్స్ అందజేసిన గుద్దేటి వెంకటరమణ గారిని ఎస్.పి. అభినందిస్తూ, పోలీసు శాఖపై జిల్లా ప్రజలకున్న అభిమానం పట్ల సంతోషం వ్యక్తపరిచారు. ప్రస్తుత కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉంటూ పలువురు సేవలందిస్తున్న తీరు ఆదర్శవంతంగా ఉన్నదని అన్నారు. లాక్ డౌన్ నిబంధనల విషయంలోనూ ప్రజల సహకారం బాగున్నదని, ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సమయం లోపుగా అందరూ తమ కార్యకలాపాలను ముగించుకోవాలని ఈసందర్భంగా ఎస్.పి. ప్రజలకు విజ్ణప్తి చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించక తప్పదని, ఈ విషయమై జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం 14,779 కేసులు నమోదు చేశామని, ఇందులో 9231 కేసులు వ్యక్తిగతమైన ఉల్లంఘన కేసులు కాగా, 5117 వాహనాలు సీజ్ చేయడంతో పాటుగా, దుకాణాల యజమానులపై 431 కేసులు నమోదయ్యాయని ఎస్.పి. గారు వివరించారు. మన ఆరోగ్యం, సంక్షేమం కొరకై విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా స్వచ్చందంగా పాటించాలని, మన తీసుకునే జాగ్రత్తల వల్లనే కోవిడ్ మహమ్మారిని నిర్మూలించగలమని ఎస్.పి. పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డి.ఎస్.పి. జి.శ్రీధర్, ఇన్స్పెక్టర్లు రాజేశ్వర్, అశోక్, రామకృష్ణ, రత్నం, వ్యాపారవేత్త గుద్దేటి శివకుమార్ ఇతరులు పాల్గొన్నారు.