సమాజంలో డాక్టర్ కు గొప్ప గౌరవం ఉందన్న మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ ...
సమాజంలో డాక్టర్ కు గొప్ప గౌరవం ఉందని రాష్ట్ర ఎక్సైజ్ , క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పలువురు ప్రభుత్వ , ప్రైవేటు వైద్యులను సన్మానించారు. ప్రాణాలు రక్షించడంలో సమాజంలో డాక్టరు తప్ప ఇతరులకు ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి డాక్టర్ విలువ తెలిసి వచ్చిందని, అయితే చివరి క్షణంలో రోగులను ఆస్పత్రికి తీసుకు వచ్చి ప్రాణాలు కాపాడలేని స్థితిలో డాక్టర్లపై నిందలువేయటం ,దాడులు చేయడం సమాజానికి మంచిది కాదని అన్నారు. ఇలాంటి పరిస్థితులు సమాజంలో డాక్టర్ వృత్తిపై భయాన్ని ,అభద్రతా భావాన్ని నెలకొల్పుతాయని తెలిపారు. ప్రస్తుత జనాభాకు సరిపోయినంత మంది డాక్టర్లు లేరని, అవసరమైనంత మంది డాక్టర్లను తయారు చేసుకోవలసిన అవసరం ఉందని అన్నారు.మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు మెడికల్ హబ్ గా ఉందని, కరోనా సమయంలో హైదరాబాద్ నుండి కూడా మహబూబ్ నగర్ కి వచ్చి చికిత్స చేయించుకున్నారని తెలిపారు. జిల్లాకు రెండు మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాల వచ్చిందని, రాబోయే కాలంలో డెంటల్ కళాశాల కూడా వస్తుందని, అయితే డాక్టర్లు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో పని చేయాలని,భవిష్యత్తులో జిల్లా డాక్టర్లకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు ఎంతో ఓపికతో తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను కాపాడినందుకు ధన్యవాదాలు తెలియజేశారు . జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు, ఐ ఎం ఏ జిల్లా అధ్యక్షుడు డా. రామ్మోహన్ మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టశ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రామ్ కిషన్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, డాక్టర్ శామ్యూల్,డాక్టర్ కిషోర్, నరసింహారావు, విజయకాంత్, మధుసూదన్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి డాక్టర్లను శాలువాలు,ప్రశంసా పత్రాలు,జ్ఞాపికలతో సత్కరించారు. ఐ ఎం ఏ తరఫున మంత్రిని ఘనంగా సన్మానించారు.