రైతు భరోసా నిధులు విడుదల

 

మహబూబ్‌నగర్, మార్చి 22 (ప్రతినిధి):
రాష్ట్ర రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం, యాసంగి సీజన్‌కు సంబంధించిన 'రైతు భరోసా' మొదటి విడత పెట్టుబడి సాయం నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు రూ. 9,000 కోట్ల సాయం.
తొలి విడతగా ఆదివారం రోజున రూ. 3,590 కోట్ల నిధులు విడుదల చేశారు.
అదేవిధంగా రాబోయే 45 రోజుల్లో విడతల వారీగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని తెలిపారు.
రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా కూరగాయలు, జొన్నలు వంటి పంట మార్పిడి పద్ధతులు పాటించాలని సీఎం సూచించారు.
జిల్లాలో సందడి: 48 రైతు వేదికల్లో వీక్షణ
ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోని 48 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి బొవోల్ల వెంకటేష్ రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ రైతు వేదిక నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ..
"మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 2,15,923 మంది రైతులకు ఎకరాకు రూ. 6,000 చొప్పున మొదటి విడత సాయం అందుతుంది. ఈ నిధులు సోమవారం నుండి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ లాభదాయకమైన సాగు చేపట్టాలి."ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి దీపిక, రంగారెడ్డిగూడెం సర్పంచ్ కాటేపగ రేవతి ఆనంద్, వివిధ గ్రామాల సర్పంచులు మడమోని మాసయ్య, ఆలోనిపల్లి అనిత సత్యనారాయణ, పూజారి శేఖర్ మరియు వార్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.