రాచాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ .....
రాచాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ .....తన చిన్నతనంలో పాడిపంటలతో కళకళ లాడిన గ్రామం ,కాలగమనంలో అభివృద్ధికి నేర్చుకోకుండా కళావిహీనంగా ఉండిపోయిందని అలాంటి తన సొంత గ్రామానికి పునరుజ్జీవనం పోసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శనివారం ఆయన అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం గ్రామంలో అత్యంత హంగులతో సుందరంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తన చిన్నతనంలో గ్రామంలోని పరిస్థితులను, గ్రామ వ్యవస్థను ,అనుబంధాలను నెమరువేసుకున్నారు. కాలగమనంలో ఊర చెరువు ఎండి పోయి పెద్ద రైతులు సైతం కూడా వలసలు వెళ్ళిన పరిస్థితిని, జ్ఞాపకాలను గ్రామస్తులతో పంచుకున్నారు. తన చిన్నతనంలో గ్రామంలో ఎక్కడ చూసినా పాడిపంటలతో గ్రామం కలకలలాడేదని, రాను రాను సాగునీరు లేక, విద్యుత్ లేక, గ్రామస్తులకు రైతులకు పని లేక పొలాలు అమ్ముకుని వలసలు వెల్లారని, కూలీలకు కూలి దొరకక ఇతర ప్రాంతాలకు బ్రతుకుతెరువు కోసం వెళ్లిపోయారని అన్నారు .
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు, సాగునీరే కాకుండా, విద్యుత్, రైతు బంధు, రైతు బీమా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.ఇందులో భాగంగానే రాచాల గ్రామానికి చెక్ డ్యామ్ ను మంజూరు చేయడమే కాకుండా పనులు చేపట్టేందుకు భూమిపూజ చేశామని, మరో చెక్ డ్యామ్ ను కూడా గ్రామానికి మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగమైన కరివేన రిజర్వాయర్ ద్వారా గ్రామంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందజేస్తామని చెప్పారు. రాచాల గ్రామం లో మినీ స్టేడియం నిర్మిస్తామని ,బ్యాడ్మింటన్ కోర్టును ఏర్పాటు చేస్తామని ,రాచాల రైతు వేదికకు ఏ సి సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలు చిన్నాభిన్నం అయ్యాయని, తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయి గ్రామాలలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఉచిత విద్యుత్, సాగునీరు, తాగునీరు ఇవ్వటమే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తున్నామని ,రైతు బీమా కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నమని ,ఒక్కఅడ్డాకుల మండలం లోనే రైతు బీమా పథకం కింద 5 కోట్ల రూపాయాలు చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగిందని, రైతు బంధు పథకం కింద రైతులు పంటలు సాగు చేసుకునేందుకు పెట్టుబడి కల్పించడం, అధిక దిగుబడులు సాధించేందుకు రైతు వేదికల నిర్మించి వారు సమాలోచన చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల తో పాటు అన్ని కులవృత్తులను , కులాలవారిని ప్రోత్సహిస్తున్నదని, ఇందులోభాగంగానే గొల్ల కుర్మలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 500 కోట్ల రూపాయలతో గొర్రెల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.రాచాల గ్రామంలోనే వృద్ధాప్య, వికలాంగ పించన్లు కింద గడచిన ఐదేళ్లలో 7 కోట్ల రూపాయల పింఛను ఇచ్చామని ఆయన తెలిపారు .
ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని,గ్రామ యువత ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని వాగుల పైన చెక్‌డ్యాంలు నిర్మించి అన్ని చోట్ల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తనతో పాటు, మంత్రులు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. డిసెంబర్ నాటికి కరివేన రిజర్వాయర్ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు .రాచాల రైతు వేదికను అత్యంత సుందరంగా నిర్మించడం జరిగిందని, దీనిని రైతుల సమావేశాలకే కాకుండా బీదవారికి ఫంక్షనులు నిర్వహించుకునేందుకు కూడా ఇవ్వాలని సూచించారు.రైతులు ప్రతివారం తప్పనిసరిగా రైతు వేదికలో సమావేశాలు నిర్వహించి కొత్త ఆలోచనలు చేసి పంటలు పండించి అధిక దిగుబడులు సాధించాలని అన్నారు.ఎం పి పి నాగార్జున రెడ్డి, జడ్పిటిసి రాజేశ్వర్‌రెడ్డి, డీఎస్ఓ వనజాత, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు యశ్వంతరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.