పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరంకొనసాగుతాయి ... మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ...
పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కేంద్రంలో ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్లె ప్రగతి లో గుర్తించిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. మండలంలో పెన్షన్ల కింద సంవత్సరానికి 13 కోట్ల 75 లక్షల రూపాయలు ఇస్తున్నామని, ఇప్పటివరకు 65 కోట్ల రూపాయలను ఇచ్చామని, 9 కోట్ల రూపాయలు కల్యాణ లక్ష్మీ కింద ఇచ్చామని ,గత 70 సంవత్సరాలుగా ఇవ్వని మొత్తాన్ని 5 సంవత్సరాల్లో ఇచ్చినట్లు మంత్రి తెలిపారు .ఇంకా పెన్షన్లు రానివారికి రెండు నెలల తర్వాత అందరికీ ఇస్తామని తెలిపారు . గత సంవత్సరం మండలంలో మహిళలకు 14 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశామని తెలిపారు. పల్లె ప్రగతి లో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. నెల రోజుల్లో మార్కెట్‌ను పూర్తిచేయాలని ,త్వరలోనే హన్వాడకు 350 ఎకరాలలో ఆహారశుద్ధి కేంద్రాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా గ్రంధాలయం, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడే అందరికీ ఉపాధి కల్పిస్తామని తెలిపారు.పల్లె ప్రగతి లో అన్ని గ్రామాల్లో ప్రత్యేకించి హరిజనవాడ లలో ఏలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అన్ని గృహాలకు మిషన్ భగీరథ తాగునీరు వచ్చేలా చూడాలని మిషన్ భగీరథ అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులు రైతుబంధు నిధులు వచ్చాయో లేదో చూడాలని ఆదేదించారు.ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా 6 మొక్కలు నాటాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని, ప్రతి గ్రామానికి చెత్త తీసేందుకు ట్రాక్టర్‌ను, ట్రాలీని ఏర్పాటు చేశామని, పల్లె ప్రగతి లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతున్నదని తప్పనిసరిగా వీటిని నాటాలని, పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు పాటించాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ , ఎంపీపీ బాల రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ కింద 8 లక్షల రూపాయల వ్యయంతో 40 మంది లబ్ధిదారులకు ఉద్దేశించిన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాక సి సి రహదారులను ప్రారంభించారు . బుద్ధారం నుండి కారం తాండ రహదారి పై కోటి 40 లక్షలతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. 3.80 లక్షల రూపాయలతో హన్వాడ బుద్దా రం లలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను, 28 లక్షల రూపాయలతో నిర్మించిన 2 తాగు నీటి ట్యాంక్ లను ప్రారంభించారు. బుద్ధారంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి విజయ నిర్మల,సర్పంచ్ రేవతి, ఎంపీటీసీ సత్యం, వైస్ ఎంపీపీ లక్ష్మి, తాసిల్దారు బక్క శ్రీనివాస్ ,ఎంపిడిఓ ధనుంజయ్ గౌడ్,ఇతర అధికారులు,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.