పట్టణ ప్రగతి ద్వారా మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో స్పష్టమైన మార్పు రావాలి ... రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ...
పట్టణ ప్రగతి ద్వారా మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో స్పష్టమైన మార్పు రావాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో విస్తృత పర్యటన చేసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పరిశుభ్రత,హరిత హారం తదితర కార్యక్రమాలను తనిఖీ చేశారు. ముందుగా ఆయన జడ్చర్ల మున్సిపాలిటీ ని సందర్శించి అక్కడ పట్టణ ప్రగతి ని పరిశీలించిన అనంతరం భూత్పూర్ మున్సిపాలిటీని సందర్శించారు.
భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారి చౌరస్తాలో రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను, కూడలి అభివృద్ధిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భూత్పూర్ - మహబూబ్ నగర్ రహదారి మధ్యలో నాటిన మొక్కలలో ఎక్కడైనా మొక్కల మధ్య ఎడం ఉన్నట్లయితే తక్షణమే పెద్ద మొక్కలు నాటించాలని ఆదేశించారు. అదేవిధంగా రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో పెద్ద మొక్కలు నాటాలని చెప్పారు.హరిత హారం లో మొక్కలు నాటారు.అనంతరం బైపాస్ రహదారిలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. అంతేకాక పాలకొండ వద్ద ఉన్న ప్రభుత్వ నర్సరీని సందర్శించి బోర్డ్ ఏర్పాటు చేయాలని,ఇలాగే అన్ని నర్సరీలలో బోర్డులు ఏర్పాటు చేయాలని డి ఎఫ్ ఓ కు చెప్పారు. ఒకవేళ చింత మొక్కలు సిద్ధంగా ఉన్నట్లయితే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎక్కడైనా చింత నాటేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు . అనంతరం ఆయన బాలాజీ నగర్ లోని పట్టణ ప్రకృతి వనం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.శుక్రవారం మొక్కలకు నీరు అందించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ తో కలిసి మొక్కలకు నీళ్లు పెట్టారు.పట్టణ ప్రకృతి వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రకృతి వనాలలో భవిష్యత్తులో ఆదాయం ఆర్జించే విధంగా సంపద వనాలను అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా టేకు, శ్రీ గంధం చెట్లు పెంచినట్లయితే భవిష్యత్తులో మున్సిపాలిటీకి మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
భగీరథ కాలనీ లో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సిడిఎంఎ తనిఖీ చేశారు. ప్రతి ఇంటి యజమాని తప్పనిసరిగా ఆరు మొక్కలను పెంచుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో మొక్కల ప్రాముఖ్యతను, మొక్కలు నాటాలని హరితహారం పాటల ద్వారా తెలియజేస్తున్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులను ఆయన అభినందిస్తూ వారికి మొక్కలను పంపిణీ చేశారు. ఆ తర్వాత పాలమూరు విశ్వవిద్యాలయం సమీపములో బండమీదపల్లె మహిళా సంఘ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ చెట్లు మానవ సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. చెట్లు లేకుండా భూమి మీద ఏ జీవరాశి ఉండదని ,అందువల్ల మొక్కలు నాటడానికి ,చెట్లు పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. తూర్పు కమాన్ వద్ద ఉన్న రైతు బజార్ ను తనిఖీ చేశారు. అక్కడ కూరగాయలమ్మే వారితో మాట్లాడుతూ వాకిన్ తీసుకున్నారా? కూరగాయల ధరలకు ఎలా అమ్ముతున్నారని అడిగి తెలుసుకున్నారు. అక్కడే కింద ఆకుకూరలను అమ్ముతున్న వారిని తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెడ్డులో అమ్మాలని సూచించారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయం వద్ద వీధి వ్యాపారులతో సి డి ఎం ఏ మాట్లాడారు. వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు మాట్లాడుతూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో, అలాగే బూత్ పూర్ -- మహబూబ్ నగర్ పట్టణం వరకు రహదారిపై ఇరువైపుల 6 వరసల మొక్కలు నాటామని, అంతేకాక రహదారి మధ్యలో పొడవైన మొక్కలను, పెద్ద మొక్కలను నాటించడం జరిగిందని తెలిపారు. అంతేకాక బైపాస్ రహదారి పై కూడా మియావాకి తరహా మొక్కలను నాటడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. నర్సరీలలో సుమారు 10 లక్షల మొక్కలను పెంచుతున్నామని, ఈ విడత హరితహారం లో మొక్కలు నాటేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కె .సి. నరసింహులు, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్ , డి ఎఫ్ ఓ గంగి రెడ్డి,మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్, నూరుల్ నజీబ్, మిషన్ భగీరథ ఎస్.ఈ వెంకటరమణ, ట్రాన్స్కో ఎస్ ఈ శ్రీరామమూర్తి, స్పెషల్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిరా తదితరులు ఉన్నారు.