పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి....మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్...
పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాక హరితహారం కింద రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు. పాలకొండ వార్డు సభలో మంత్రి మాట్లాడుతూ మునిసిపల్ వార్డులు, గ్రామాలలో ఎక్కడ చెత్త ఉండకూడదని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, చెత్తాచెదారం తీసివేయాలని, ప్రతి ఇంటి ముందు 6 మొక్కలు నాటాలని కోరారు. ఊరంతటినీ శుభ్రంగా ఉంచాలని, వార్డు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. గతంలో పాలకొండ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. వార్డులో పింఛన్లు రాని వారందరికీ రెండు నెలల తర్వాత పింఛన్లు ఇస్తామని తెలిపారు. 14 లక్షల రూపాయలతో పాలకొండ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామంలో మురికి కాలువ సమస్యను రేపటిలోగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రహదారికి ఆవలివైపున ఉన్న 15 ఇళ్లకు తాగునీరు లేదని తెలుసుకున్న మంత్రి తక్షణమే రాత్రి లో గా తాగునీరు అందించాలని ఆదేశించారు. రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని ,గ్రామంలోని అన్ని కులాల వారికి ఉపయోగపడేలా స్మశాన వాటిక నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.బై పాస్ రహదారి వెంట గ్రామానికి సమీపంలో కూరగాయలు ,హోటల్ లాంటివి ఏర్పాటు చేసుకునెందు వీధి దుకాణాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతేకాక గ్రామంలో కూడా దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. పెన్షన్ రాని వారి జాబితాను రూపొందించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మాట్లాడుతూ పట్టణ ప్రగతి,పల్లె ప్రగతి కార్యక్రమాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఒక రోజు విద్యుత్ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కే .సి.నర్సింహులు మాట్లాడుతూ పట్టణ ప్రగతి వచ్చిన తర్వాత పరిశుభ్రత పెరిగి ప్రజలు రోగాల బారిన పడటం తగ్గిందని అన్నారు. వార్డుల్లో ఏవైనా సమస్యలుంటే వార్డ్ కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,మున్సిపల్ కౌన్సిలర్ నరేందర్,ట్రాన్స్కో ఎస్ ఈ శ్రీరామమూర్తి,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, వార్డు కమిటీ అధ్యక్షుడు టి ఆంజనేయులు, పిఎసిఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్,మున్సిపల్ డి ఈ వెంకన్న, సంజీవరెడ్డి తదితరులు హాజరయ్యారు.