ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి .... జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు....

ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు కోరారు.కోవిడ్  దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహించకుండా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యక్తిగత సమస్యలతో పాటు, బ్యాంకు రుణాలు  ,సదరం సర్టిఫికెట్లు , పెన్షన్లు,భూములకు సంబంధించిన సమస్యలు,  శానిటేషన్ తదితర అంశాలపై పలువురు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఫోన్ ద్వారా వారి సమస్యలను విన్నవించారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.ముఖ్యంగా చిన్నచింతకుంట మండలం  అప్పంపల్లి కి చెందిన రైతు జీవన్ బాబు గత ఐదారు నెలలుగా వ్యవసాయ రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నానని, బ్యాంకు రుణం మంజూరు చేయాలని  విజ్ఞప్తి చేయగా, జిల్లా కలెక్టర్ స్పందించి యూనియన్ బ్యాంకు అధికారులతో మాట్లాడి  వ్యవసాయ రుణం మంజూరు చేయించారు.అదేవిధంగా కొన్ని దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు.మరికొన్నిటిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున అలాంటి వాటిపై తదనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా సోమవారం నాటి ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా బ్యాంకు రుణాలు, సదరం సర్టిఫికెట్లు, వ్యక్తిగత సమస్యల పైన ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ ప్రజావాణి ద్వారా స్వీకరించిన పిర్యాదుల కు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని,  వీటి పై  స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని జాప్యం చేయవద్దని, పెండింగ్లో ఉందని తెలిపారు. ఒకవేళ వారి పరిధిలో లేని సమస్య ఉన్నట్లయితే  వాటిని తమ దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని వారి ఫిర్యాదులను  ఆన్లైన్ ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి సోమవారం ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదుదారులు వారు ఉన్న చోట నుండి వాట్సాప్ ఫోన్ నెంబర్  9154463001 ద్వారా స్వయంగా మాట్లాడుతూ సమస్యను తనకు వివరించడం ద్వారా పరిష్కారం పొందవచ్చని కలెక్టర్ సూచించారు.  సోమవారం సుమారు 13 మంది పిర్యాదుదారులు వారి సమస్యలను ఫిన్ ద్వారా జిల్లా కాలెక్టర్ కు సమర్పించారు