నూతనంగా ఏర్పాటైన మహమ్మదాబాద్ మండలంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలన్న ... జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు...

నూతనంగా ఏర్పాటైన మహమ్మదాబాద్ మండలంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు. ఇందుకుగాను జిల్లా అధికారులు మహమ్మదాబాద్ మండలంలో చేపట్టిన పనుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. శనివారం ఆయన  నేషనల్ రూర్బన్ మిషన్  కింద మహమ్మదాబాద్,గండీడ్ మండలాలకు  మంజూరైన పనులపై జిల్లా, మండల స్థాయి అధికారులతో  సమీక్షించారు. కొత్త మండలం లో అభివృద్ధి పనులు బాగా జరగాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు ,సిబ్బంది పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.  గండీడ్, మహమ్మదాబాద్ రెండు మండలాల అభివృద్ధికి సంబంధించి  రూర్బన్ కింద పనులు మంజూరు చేయడం జరిగిందని, ఆయా శాఖల అధికారులు వారి రెగ్యులర్ పనులతో పాటు, రూర్బన్ పనుల పై కూడా ఎక్కువ దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. నూతన మండలం మహమ్మదాబాద్ కు ఈ రోజే  (శనివారం)ధరణి లాగిన్ కూడా వచ్చిందని, అందువల్ల ఇకపై భూములకు సంబంధించిన విషయాలను ఇక్కడే నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.ఆయా శాఖల వారీగా రూర్బన్  కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.  వివిధ శాఖల ద్వారా చేపట్టి పెండింగ్లో ఉన్న పనులన్నింటిని  జూలై 31 నాటికి పూర్తి చేయాలని, పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, అగ్రికల్చర్ ,హార్టికల్చర్ తదితర శాఖల కింద చేపట్టిన పనుల పై ఎక్కువ  దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. మండల స్థాయిలో తాహసిల్దార్, ఎంపీడీవో, పంచాయతీరాజ్,ఇతర ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  రూర్బన్ కింద  గ్రామీణ ప్రాంతంలో పనులు చేపడుతున్నప్పటికీ మండల కేంద్రం, పెద్ద పట్టణాలలో పట్టణ వాతావరణాన్ని తలపించేలా పనులు ఉండాలన కలెక్టర్ సూచించారు. నిర్దేశించిన సమయం ప్రకారం పనులను పూర్తి చేయాలని,  పనుల పురోగతిని వాట్సాప్ గ్రూపులో ఎప్పటికప్పుడు పంపించాలని అన్నారు. రూర్బన్  కింద చేపట్టి పూర్తయిన పనులను వచ్చే బుధవారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.పరిగి శాసనసభ్యులు కె. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రూర్బన్  కింద రెండు మండలాలకు పలు పథకాలు మంజూరయ్యాయని ,ఇప్పటి వరకు 30 శాతం పనులు పూర్తయ్యాయని ,తక్కిన పనులను త్వరితగతిన  పూర్తి చేయడంపై జిల్లా ,మండల స్థాయి అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. తమ దృష్టికి వచ్చిన కొన్ని  స్థలాల సమస్యలను కూడా పరిష్కరించడం జరిగిందని ,రైతు బజార్,ఉద్యాన  పనులు ప్రారంభం కావాల్సి ఉందని,అన్నారు.జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రెండు నెలల్లో వీటిని పూర్తి చేసేందుకు అవకాశం ఉందని ,అందుకుగాను అందరి సహకారం అవసరమని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి  రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఎంపీపీ మాధవి రాజ్ కుమార్, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి ,డిఆర్డిఓ యాదయ్య, ఆర్డిఓ పద్మ శ్రీ, మహమ్మదాబాద్,గండీడ్ మండలాల తహసీల్దార్లు ,ఎంపీడీఓలు, డి ఎఫ్ ఓ గంగి రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత, డిప్యూటీ డిఎంహెచ్ బో డాక్టర్ శశికాంత్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి మధుసూదన్ గౌడ్, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్, మార్కెటింగ్ ఏడి సారిక ఉద్యాన శాఖ డిడి సాయిబాబా, విద్యుత్ ,ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.