ముంచుకొస్తున్న వానలు...కొలిక్కిరాని కొనుగోళ్లు...
ముంచుకొస్తున్న వానలు...కొలిక్కిరాని కొనుగోళ్లు...
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఈసారి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్నదాతలు వరి పంటను సాగుచేశారు. వర్షం సమృద్ధిగా కురియడంతో పంట దిగుబడి బాగా వచ్చింది. దాంతో అన్నదాతలు సంబరపడిపోయారు. కల్లాలనిండా వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా కనిపించడంతో ఇక తమ కష్టాలు కడ తేరుతాయని అన్నదాతలు భావించారు. ధాన్యాన్ని శుద్ధి చేసి అమ్మకాల కోసం సిద్ధం చేశారు. అయితే ఈ సంవత్సరం కొనుగోళ్లు ప్రారంభించిన ప్రభుత్వం అన్నదాతల నుండి ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతుండడంతో రైతులు తమ ధాన్యపు రాసుల దగ్గర రోజుల తరబడి కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు రెండు నెలలుగా దాన్యం క్రయ,విక్రయాలు కొనసాగుతున్నా అవి ఓ కొలిక్కి రాలేదు. ప్రతిరోజు అన్నదాతలు తాము కొనుగోలు కేంద్రాల దగ్గరికి చేర్చిన ధాన్యపు కుప్పల దగ్గరికి వెళ్లి వాటిని పరిశీలించి రావడం నిత్యకృత్యంగా మారింది. పంటల సాగు సమయంలోనే పంట దిగుబడి గురించి పూర్తి సమాచారం ఉన్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అంతేకాక కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల తరలింపులో కూడా తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు దాన్యం కుప్పలు పోయడానికి కూడా స్థలం దొరకటం లేదు. దానివల్ల రైతుల దాన్యం ఇంకా క్వింటాళ్ల కొలది కల్లాల్లోనే ఉండిపోయింది. ధాన్యాన్ని అమ్మకాల కోసం కేంద్రాల వద్దకు తీసుకెళుతున్న అన్నదాతలు దాన్యం తీసుకెళ్ళిన వాహనాలను కూడా ఖాళీ చేయడానికి రోజుల తరబడి లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది.ఇలాంటి దుస్థితిలో అన్నదాతలు అవస్థలు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన దాన్యం ఇంకా విక్రయించక ముందే వర్షాకాలం ప్రారంభమైంది.వర్షాకాలం సీజన్ ప్రారంభంతో అన్నదాతలు ప్రతి సంవత్సరం ఎంతో సంబరపడే వారు. ఈ సంవత్సరం దాన్యం విక్రయాలు పూర్తికాకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి ఎక్కడికక్కడ కొనుగోలు చేసి వర్షాకాలం సీజన్లో ఆనందోత్సాహాలతో అన్నదాతలు పంటల సాగుకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.