ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోన కేసులు పెరుగుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోన కేసులు పెరుగుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి కరోనా వార్డులో గతంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను తనిఖీ చేశారు .
కరోనా వల్ల భయపడాల్సిన పని లేదని,ఎవరికైనా దగ్గు, జ్వరం ,జలుబు లాంటివి వచ్చినట్లయితే భయపడకుండా జిల్లా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, ఒకవేళ పాజిటివ్ వచ్చినప్పటికీ ఆందోళన పడకుండా తక్షణమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 150 పడకల కరోన వార్డు లో అడ్మిట్ కావాలని కోరారు .అదే సమయంలో ఇంట్లోని వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
గత సంవత్సరం మార్చిలో కరోనా వైరస్ వచ్చిన సమయంలో ఎలాంటి వైద్య సదుపాయాలు జిల్లాలో లేవని, అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని వైద్య చికిత్సలు అందించడంతోపాటు ప్రజలందరూ నిత్యావసరాలకు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో వైద్యపరంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని , ప్రత్యేకించి కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ఎస్.వి. ఎస్ ఆస్పత్రిలో ఆర్ టి పి సి ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశామని,ఆక్సీజెన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే 18 వైద్య బృందాలు పనిచేస్తున్నాయని, జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అంతకుముందు ఆయన కరోనా పరీక్షలు నిర్వహించే వార్డుతో పాటు, కరోనా ప్రత్యేక వార్డు ను సందర్శించి కరోనా వచ్చిన రోగులతో మాట్లాడారు. ప్రత్యేక వార్డు ను సుందరీకరించాలని,ముఖ్యంగా గ్రీన్ మెస్, పూల మొక్కలు ఏర్పాటు చేయాలని, కరోనా వార్డు ని ఆనుకుని ఉన్న స్థలంలో 400 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని, ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ ఆవరణలో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వార్డులో అవసరమైన అన్ని సౌకర్యాలను విస్తరించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఆసుపత్రి సూపరింటిన్డెంట్ డాక్టర్ రామ్ కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శశికాంత్ ,ఆర్ ఎం ఓ డాక్టర్ జీవన్, మున్సిపల్ చైర్మన్ కె.సి నరసింహులు, ఆస్పత్రి అభివృద్ధి సంస్థ సభ్యులు లక్ష్మి, మల్లేష్, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి శంకర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, తదితరులు మంత్రి వెంట ఉన్నారు
____________