మహబూబ్ నగర్ జిల్లా ను సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయం...మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్..

మహబూబ్ నగర్ జిల్లా ను సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇందుకుగాను పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర ప్రాజెక్టులు,చెక్ డ్యాముల నిర్మాణంతో జిల్లాలోని భూములన్నింటికి సాగు నీరు అందించి సంవత్సరంలో రెండు పంటలు పండించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.బుధవారం ఆయన హన్వాడ మండలం వేపూరు గ్రామం లో 6 కోట్ల 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రెండు చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ రెండు చెక్ డ్యాముల నిర్మాణంతో వేపూర్ గ్రామంలో సుమారు 400 ఎకరాల భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. దీంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద హన్వాడ మండలానికి సాగునీరు అందించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.  ఊరు బాగుకోసం చెక్ డ్యాములు చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా వాగుపై 4 చెక్ డ్యాములు నిర్మించడం వల్ల ఎల్లప్పుడు వాగులో నీరు నిల్వ ఉంటుందని ,ఎండాకాలంలో కూడా నీరు నిల్వ ఉంటుందని, దీని ద్వారా రైతులు రెండు పంటలు పండించుకోవచ్చు అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జడ్పిటిసి విజయలక్ష్మి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్ సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.