మనిషిని మనిషిగా సమానత్వ భావంతో చూడాలన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్...
మనిషిని మనిషిగా సమానత్వ భావంతో చూడాలన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన తెలంగాణ చౌరస్థ( జంక్షన్ ) ను,ఆధునీకరించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహన్నీ మంత్రి ఆవిష్కరించి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దేశంలో ఇంకా అక్కడక్కడ అసమానత్వం కనబడుతున్నదని, వ్యత్యాసాలు లేని సమాజాన్ని, మనిషిని మనిషిగా చూడాలనే సదాశయంతో మంచి గొప్ప సందేశం ఇచ్చిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇప్పటి తరం పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.రిజర్వేషన్ల ద్వారా పైకి వచ్చిన వారు బడుగు బలహీన వర్గాలలో ఉన్న పేదలు,నీరు పేదలను పైకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని,ఇందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం లాగానే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చౌరస్తాలో ఏర్పాటు చేస్తామని, అంతేకాక గడియారం చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్, జ్యోతిబాపూలే వంటి మహనీయుల విగ్రహాలను ఐదు వైపుల చౌరస్తాలలో పెడతామని తెలిపారు. భారత జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల చరిత్ర వారి విగ్రహాలను ప్రతి రోజు చూడగానే గుర్తుండిపోయేలా పట్టణంలో జంక్షన్లను అభివృద్ధి చేసి మహనీయుల విగ్రహాలను నెలకొల్పుతామని తెలిపారు . సమాజంలో నెలకొన్న కుల మతాలను కూకటివేళ్ళతో పెకలించి వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ మంచి పనులు చేస్తూ జన్మను సార్థకం చేసుకోవాలని, నిస్వార్థంగా పేదలకు నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు . జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్ , రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, డిఎస్పీ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,లయన్ నటరా జ్,దళిత సంఘాల నాయకులు రాయకంటి రామ్ దాస్, భీమయ్య, శ్రీనివాస్ ,హనుమంతు, చంద్ర నాయక్ కురుమూర్తి, బాల పీర్ తదితరులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహని కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .