మనం తీసుకునే జాగ్రత్తలు మనకు రక్షణ... జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు...
మనం తీసుకునే జాగ్రత్తలు మనకు రక్షణ... జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు...
అవునూ... కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. సాధారణ జనజీవనం ప్రారంభమై, అందరూ కాసింత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదెలా సాధ్యమైంది. గతేడాది కోవిడ్ భూతం చేసిన విధ్వంసం, ఈ ఏడాది కూడ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడానికి ముందు ఈ అంటురోగం భయపెట్టిన తీరు మనందరి కండ్ల ముందు కనిపించిన దృశ్యాలు. మరిప్పుడు మన చూట్టూతా కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడి, ప్రజలుఒకరి ముఖాలు ఒకరు చూసుకోగల్గుతున్నారు. వివిధ రకాల వృత్తుల వారూ, చిరు వ్యాపారులు కూడ తమ వ్యాపకాలను చేసుకుంటున్నారు. ఒక పెద్ద కుదుపు నుండి తేరుకుని మామూలు స్థాయికి చేరుకున్న ప్రస్తుత తీరును గమనిస్తే, మనమేమి చేస్తే తీవ్ర భయాందోళనలను కలిగించిన స్థితిని జయించగలిగామన్నది ప్రధానంగా గమనించాలి.ఒక అంటురోగం... మనిషి నుండి మాత్రమే మనుషులకు విస్తరించే భూతం. ఈ భూతాన్ని అంతం చేయడానికిగానూ వైద్యపరంగా అవసరమైన భౌతిక దూరం పాటించాము, మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, అనవసరంగా బయట తిరగకుండా కట్టడి చేసుకోవడం వలన ఒక భయానక అంటురోగం నుండి మనలను మనం కాపాడుకోగలిగాం. ఒకింత ఊరట పొందినా, ఈ మాయదారి కరోనా అంటురోగం పూర్తిస్థాయిలో నిర్మూలించబడలేదన్నది మనందరికీ ఎరుకైన వాస్తవం. అందుకే... కనిపించని ఈ మాయరోగాన్ని సమూలంగా అంతం చేసేందుకుగానూ ఇప్పటిదాకా తీసుకున్న జాగ్రత్తలను ఇకముందూ కొనసాగించడం మనందరికీ శ్రీరామ రక్ష అవుతుంది. మనకు పక్కాగా తెలిసిన జాగ్రత్తలు పాటిస్తూ, స్వీయ క్రమశిక్షణతో మసలుకోవడమే ఈ భయంకరమైన విపత్తుకు సరైన మందు అవుతుందని జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మనకొఱకు, మన బతుకు కొరకు ఎవరికివారు బాధ్యతగా నడుచుకోవలసిన సందర్భాన్ని గుర్తించి, ప్రభుత్వం, పోలీసు శాఖ ఆంక్షలు, ప్రమేయం లేకుండానే మహమ్మారిని అంతం చేయడంలో ప్రజలంతా సైనికుల పాత్ర పోషించాలని ఎస్.పి. ఆర్.వేంకటేశ్వర్లుపిలుపునిచ్చారు.