మనకు తెలియని శత్రువుతో పోరాటం చేసే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడంఅవసరం ... జిల్లా ఎస్.పి. రావిరాల వెంకటేశ్వర్లు ....
మనకు తెలియని శత్రువుతో పోరాటం చేసే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని జిల్లా ఎస్.పి. రావిరాల వెంకటేశ్వర్లు ... అన్నారు. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి చేసిన, చేస్తున్న విధ్వంసం మనందరం చూస్తూనే ఉన్నామని, కేవలం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ భూతాన్ని నిర్మూలించగలమనే విషయం గుర్తుంచుకుని జీవనశైలిలో మార్పు చేసుకోవాలని ఎస్.పి. గారు వివరించారు. కోవిడ్ నుండి కోలుకున్న పోలీసు సిబ్బందిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారి కొరకు నేటి (మంగళవారం) ఉదయం పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఎస్.పి. గారు మాట్లాడుతూ....సహజసిద్ధమైన శారీరక, మానసిక దారుఢ్యం మన పోలీసు సొంతమన్నది గుర్తుంచుకుని ధైర్యంగా ఉండాలని అన్నారు. ఒక సమస్య, అనారోగ్యం వంటివి ఏవైనాసరే ఆందోళన చెందకుండా నిబ్బరంగా ఉంటూ పరిష్కారం వైపుగా ఆలోచించి, ముందడుగు వేయాలని సూచించారు. మన పోలీసు శాఖలోని సిబ్బంది ప్రతిఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, అనారోగ్యానికి గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాయామం, నడక, యోగా, ధ్యానం, ఆటలు ఇలా ఏదో ఒక వ్యాపకాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం తప్పనిసరి కావాలని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి నిర్మూలన, ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా పోలీసు సిబ్బంది చేస్తున్న కృషి సర్వదా అభినందనలు అందుకోవడం తనకు గర్వకారణంగా ఉన్నదని ఎస్.పి. గారు సంతోషం వ్యక్తపరిచారు. అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉన్న పోలీసు సిబ్బందికి ఎల్లవేళలా అండదండగా ఉండడం, నా ప్రాథమిక బాధ్యతగా భావిస్తానని భరోసా ఇస్తూ, నేటి వైద్య శిబిరంలో వైద్య నిష్ణాతులైన పల్మనాలజిస్ట్, జనరల్ మెడిసిన్, చెవి ముక్కు గొంతు రోగ నివారణ వైద్యులతో పాటుగా ఇతర విభాగాల వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కేవలం ముందస్తు జాగ్రత్తల కొరకు, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులలో ఆత్మస్థైర్యం నింపేందుకు 37 మంది పోలీసు సిబ్బందికి కావలసిన పరీక్షలు వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, చికిత్స అవసరమైతే తగు చర్యలు తీసుకుంటామని ఎస్.పి. గారు తెలిపారు. సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణకై సహకారం అందించిన ఎస్.వి.ఎస్. యాజమాన్యం వారికి ఎస్.పి. గారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్.పి. అడ్మిన్ శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు గారు వైద్య శిబిరాన్ని సమన్వయం చేస్తూ, పోలీసు సిబ్బంది సంక్షేమం పట్ల ఎస్.పి. గారు తీసుకుంటున్న శ్రద్దకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిద్దిఖ్, డాక్టర్ ముఖ్తార్, డాక్టర్ నేహా, డాక్టర్ కేశవ్, పోలీసు ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీనివాస్, పోలీస్ సంఘ అధ్యక్షుడు వెంకటయ్య, ఉపాధ్యక్షుడు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.