మహిళా సంఘాలు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు పిలుపు ...
మహిళా సంఘాలు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు పిలుపు ...హరితహారం కార్యక్రమంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులందరు పెద్ద ఎత్తున భాగస్వాములై మొక్కలు నాటి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుండి ఏ పీ ఎం లు, సీసీలు, గ్రామ సమాఖ్యలు, స్వయం సహాయక మహిళా సంఘాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం వల్ల జిల్లాలో పచ్చదనం పెరుగుతుందని అన్నారు.హరిత హారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఉన్న అన్ని మహిళా సంఘాల సభ్యులు హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములు కావాలని,ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు, రహదారులకు ఇరువైపులా, అన్ని కార్యాలయాలు, ప్రైవేటు భూములు,ఇండ్లు,పొలం గట్లు,చెరువు కట్టలపై పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరితహారం కార్యక్రమంలో జిల్లా ను అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. ఇందుకుగాను ఇప్పటి నుండే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడాన్ని ఒక లక్ష్యంగా తీసుకుని మొక్కలు నాటాలని చెప్పారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు జిల్లాలో చేపట్టిన రెండు కోట్ల విత్తన బంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దీని వల్ల జిల్లాలో అడవుల శాతం పెరుగుతుందని అన్నారు. మహిళ సంఘాలు మహా బ్రాండ్ పేరుతో చేపట్టిన ఉత్పత్తులను ఇంకా పెంచాలని, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ఇంకా మంచి పేరు తీసుకురావాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా వివిధ రకాల వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున ప్రజలు వ్యాధుల బారిన పడకుండా గ్రామ సంఘాలు జాగృతం చేయాలని, ముఖ్యంగా వానాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, జ్వరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని,వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు చర్యలపై ప్రజలందరికీ తెలియజేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిఆర్డిఓ యాదయ్య ,ఏపీ డి లు నాగమల్లిక ,శారద, డి ఐఓ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.