మహబూబ్ నగర్ జిల్లా నుండి ఏ ఒక్కరు హైదరాబాద్ కు వైద్యం కోసం వెళ్లకుండా చేస్తా ... మంత్రి వీ . శ్రీనివాస్ గౌడ్ ...

 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఏ ఒక్కరు హైదరాబాద్ కు వైద్యం కోసం వెళ్లకుండా ఖరీదైన వైద్యాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  శుక్రవారం ఆయన  ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రెండు వందల పడకల ఆక్సిజన్ లైన్ వార్డు ను ప్రారంభించారు.   మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ  జనరల్ ఆస్పత్రిలో 500 పడకల వరకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని, 60 ఐసియు బెడ్ లు ఉన్నాయని అన్నారు. రెండవ విడత కరోనాలో వైద్యం కోసం ఎవరు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడనే మెరుగైన వైద్యం అందించడం జరిగిందని తెలిపారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతనమైన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని కూడా ప్రారంభించామని అన్నారు. తమిళనాడు,కేరళ ఆసుపత్రులను  అధ్యయనం చేసి  మహబూబ్ నగర్ లో కూడా అలా తీర్చిదిద్దుతామని,సాధారణ కాన్పులయ్యేలా చూస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, ఆర్ఎంఓ డాక్టర్ జీవన్ తదితరులు ఉన్నారు.