కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది... రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. గురువారం మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 45 లక్షల 43,268 రూపాయల విలువ చేసే చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక శాఖ అమలు చేసే పథకాలలో అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా గతంలో కార్మికులకు సౌకర్యాలు అంతగా ఉండేవి కాదని కానీ ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా కార్మికులు మరణించినట్లయితే 6 లక్షల రూపాయలు, పూర్తిగా అంగవైకల్యం సంభవిస్తే 5 లక్షలు లక్షలు, సహజ మరణం పొందినట్లైతే లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. కార్మికుని కూతురు వివాహ కానుకగా 30 వేల రూపాయలు, ప్రసూతి సహాయం కింద 30 వేల రూపాయలు, అనారోగ్య వైద్య చికిత్స నిమిత్తం 9 వేల రూపాయలు, కార్మికులు మరణిస్తే దహన సంస్కారాల కోసం 30 వేల రూపాయలు ,వృత్తి నైపుణ్య శిక్షణ కు 4500 అందజేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నదని, మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలో 2014 లో 70 ప్రసవాలు ఉండగా,ఇప్పుడు 2300 వరకు పెరిగిందని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో న్యాక్ తోపాటు, ఎల్ అండ్ టి, సెట్విన్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తామని అన్నారు. కార్మిక శాఖ ద్వారా సహాయం కోసం ముందుగా నమోదు చేసుకొని ఉండాలని తెలిపారు. 78 వేల మంది కార్మికులు జిల్లాలో కార్మిక శాఖ వద్ద నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఎల్ అండ్ టి ద్వారా ఎలక్ట్రికల్ శిక్షణను, న్యాక్ ద్వారా మేస్ట్రీ శిక్షణ, సెట్విన్ ద్వారా మరో రకమైన శిక్షణను అందిస్తామని, పేద ప్రజలు వీటిని వినియోగించుకోవాల్సిన గా ఆయన విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ పి .ఆర్. వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్,ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాక్ ద్వారా 80 మంది కార్మికులకు మేస్త్రి శిక్షణ సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన 17మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు.