కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల తో ఒక్కసారైనా ప్రత్యక్షంగా మాట్లాడాలని జిల్లా కలెక్టర్ వెంకట రావు చెప్పారు

   కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల తో  ఒక్కసారైనా ప్రత్యక్షంగా మాట్లాడాలని  జిల్లా కలెక్టర్ వెంకట రావు చెప్పారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్  విషయంలో తహశీల్దారులు పూర్తి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి శనివారం ఆ వారంలో వచ్చిన దరఖాస్తులను  ప్రత్యక్షంగా పరిశీలించి తగు చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.   మంగళవారం ఆయన  జిల్లా కలెక్టర్  కార్యాలయం నుండి తాసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాకు కోటి 53 లక్షల రూపాయలను మంజూరు చేసిందని కలెక్టర్ చెప్పారు. ఇప్పటివరకు 7219 దరఖాస్తులు వచ్చాయని, తాసిల్దార్ల పరిశీలనలో  634 దరఖాస్తులు ఉండగా, మరికొన్ని శాసనసభ్యుల అనుమతి కోసం పెండింగ్లో ఉన్నాయని, వీటన్నిటిని ప్రత్యక్షంగా పరిశీలించి  సాధ్యమైనంత త్వరగా అర్హులైన  లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంజూరు విషయంలో ఏవైనా తప్పులు జరిగినట్లయితే పూర్తి బాధ్యత తాసిల్దార్ దేనని ,అందువల్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా తాసిల్దార్ లు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.   ప్రజావాణి ఫిర్యాదులను తహశీల్దారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటిని పరిష్కరించే  చర్యలు తీసుకోవాలని అన్నారు.పెండింగ్ సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మ్యుటేషన్లు సైతం పూర్తి జాగ్రత్తగా చేయాలని,ఎక్కడైనా ఈ  విషయంలో పొరపాటు జరిగినట్లయితే క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ధరణి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించడం జరుగుతున్నదని ,ధరణి పట్ల ప్రజలకు  ఉన్న నమ్మకాన్ని అదేవిధంగా కొనసాగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం  ధరణి లో మరికొన్ని ఆప్షన్లను ఇచ్చిందని కలెక్టర్ తెలియజేస్తూ తాసిల్దారు ప్రతిరోజు ధరణిపై ఆపరేటర్లతో 15 నిమిషాల పాటు సమీక్షించుకోవలసిన అవసరం ఉందని సూచించారు .  ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డి. ఆర్ ఓ కే .స్వర్ణలత తదితరులు హాజరయ్యారు.