జిల్లాలో ముఖ్యమంత్రి గిరి వికాసం పథకాన్ని వేగవంతం చేయాలి.... జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు...
జిల్లాలో ముఖ్యమంత్రి గిరి వికాసం పథకాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అధికారులను ఆదేశించారు.వారం రోజులపాటు మండల స్థాయి అధికారులు ముఖ్యమంత్రి గిరి వికాసం కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.మంగళ వారం ఆయన తన చాంబర్లో ముఖ్యమంత్రి గిరి వికాసం కార్యక్రమం పై సమీక్షించారు.వచ్చే వారం నుండి తనతో పాటు అదనపు కలెక్టర్ , డిఆర్ఓ ఇతర సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో గిరి వికాసం పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సీఎం గిరి వికాస కార్యక్రమం అమలులో తక్కువ ప్రగతి ఉన్న మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తో ప్రత్యేకంగా సమీక్షించారు. రానున్న సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గిరి వికాస పథకంలో అనుకున్న మార్పులు రావాలని ఆయన అన్నారు. భూమి అభివృద్ధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో బోరు, నీటి సౌకర్యం ఉన్న భూములనే ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములకు సంబంధించి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు గాను విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేకంగా భూమి అభివృద్ధి పథకానికి ఒక సహాయ సంచాలకులు స్థాయి అధికారి నియమించాలని విద్యుత్ శాఖ అధికారులతో కోరారు. ఇకపై ప్రతి వారం నిర్వహించే అధికారుల సమ్మిళిత సమావేశంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పై సమీక్షించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి మండలంలో పది నుండి ఇరవై ఎకరాల వరకు సీఎం గిరి వికాస పథకంలో లేదా భూమి అభివృద్ధి పథకం కింద చూడాలని అన్నారు.
ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచాలని ఎంపీ డి ఓ లను ఆదేశించారు. ఎంపీడీవో ఏపీఓలు సమన్వయంతో గ్రామాలలో కూలీల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధరణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ధరణిలో అన్ని కార్యక్రమాలు ఆన్లైన్లోనే నిర్వహించాలని, మాన్యువల్ గా ఏలాంటి పనులు చేయకూడదు అని ఆయన చెప్పారు. ధరణిలో సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని అలాంటి సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెప్పారు . ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ సీతారామ రావు, డి ఆర్ ఓ స్వర్ణ లత, జిల్లా షెడ్యూల్ తెగల సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్ సి సంక్షేమ కార్పొరేషన్ ఈడీ యాదయ్య , డి ఆర్ డి ఓ వెంకట్ రెడ్డి,ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.