జడ్చర్లలో మొదలైన ఎన్నికల కోలాహలం.... ప్రధాన రాజకీయ పార్టీల ప్రముఖ నేతల రాక...జోరు అందుకున్న నామినేషన్ల దాఖలు....

జడ్చర్లలో మొదలైన ఎన్నికల కోలాహలం.... ప్రధాన రాజకీయ పార్టీల ప్రముఖ నేతల రాక...జోరు అందుకున్న నామినేషన్ల దాఖలు....

జడ్చర్లలో ఎన్నికల వేడి నెలకొంది. ఈనెల 30వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం నాడు జోరుగా కొనసాగింది. ఆదివారం ఒక్కరోజే నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేయాలనుకున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అవసరమైన ధ్రువపత్రాల కోసం వ్యయ ప్రయాసలకోర్చారు. పట్టణంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీ ల ప్రముఖుల రాక మొదలైంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ లో రాజకీయ పార్టీల నాయకులు తలమునకలయ్యారు. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్,బిజెపి, కాంగ్రెస్ పార్టీల ఇన్చార్జిలు పట్టణంలోనే తిష్టవేసి అభ్యర్థుల ఎంపికలో కీలక భూమిక పోషిస్తున్నారు. మొదటి నుండి ఏకపక్షంగా జరుగుతాయనుకున్న ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు  రంగంలోకి దిగడంతో ఆసక్తికరంగా మారాయి. అభ్యర్థుల ఎంపికలో నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న నాయకులు రాజకీయాలను పక్కనబెట్టి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. శనివారం ప్రధాన ప్రతిపక్షం అయిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తో పాటు ఆ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు విచ్చేసి స్థానిక పార్టీ నాయకులతో జోరుగా మంతనాలు జరిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ పై అలక వహించే వారి పై వారు దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది అలాగే ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తూ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్న వారి బలాబలాలను పరిశీలిస్తూ అభ్యర్థుల ఎంపిక లో తలమునకలయ్యారు. డీకే అరుణ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ఎవరిని ఏ వార్డు నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయో అనే విషయాల గురించి ఆమె ఆరా తీశారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల కోసం ఆరాట పడుతున్న నాయకులు ఇప్పటివరకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నుండి ఏ విధమైన సంకేతాలు వెలువడక పోవడంతో చివరి వరకు వేచి చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం నామినేషన్ల దాఖలు జోరందుకుంది.    అధికారికంగా రాజకీయ పార్టీలు బీ ఫారాలు  జారీ చేయకున్న 15 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 27 వార్డులకు గాను 15 నామినేషన్లు దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. రెండో వార్డు కు 1, మూడో వార్డు కు 2, నామినేషన్లు దాఖలు కాగా 4,5,10,18,27 వార్డులకు ఒక్కో నామినేషన్ చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 14,16,20,21వార్డులకు రెండు నామినేషన్లు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు జోరు అందుకోవడంతో మున్సిపల్ కార్యాలయం మొత్తం ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న అభ్యర్థులు అందుకు సంబంధించిన ధ్రువ పత్రాలను పొందేందుకు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులుతీరి నిలబడ్డారు. ఆదివారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మరింత జోరుగా నామినేషన్ల దాఖలు అవకాశాలు ఉన్నాయి. చైర్ పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమం కొనసాగుతుండడంతో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు జడ్చర్ల కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు శ్రమ చేసి శ్రమపడి తమ వార్డులుగా ఎన్నుకొని ఆయా వార్డులలో ప్రజలకు సేవలందిస్తూ వచ్చామని, ప్రస్తుతం ఎన్నికలు వచ్చిన తరుణంలో లో రాజకీయ పార్టీల నియోజకవర్గ ఇన్చార్జి ల నుండి తమకు ఎలాంటి సంకేతాలు అందక పోతుండడంతో లో లోపల  తీవ్రంగా మదన పడుతున్న నాయకులు, ఎలాగైనా బరిలోకి దిగి తమ సత్తా చాటి చూపేందుకు ఉవ్విళ్ళూరు తున్నారు.