జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలి-- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు...

 జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలి-- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు రాష్ట్రం లో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థానాలకు ఎన్నికల నిర్వహణకై రాష్ట్ర  ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినందున  జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో తక్షణమే  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని  తూ.చ తప్పకుండా పాటించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ విషయమై ప్రకటన వెలువడిన వెంటనే జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు.శుక్రవారం జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ  ఏర్పాట్లను జిల్లా ఎస్ పి.ఆర్. వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు .ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే రిటర్నింగ్ అధికారులతో  సమావేశం నిర్వహించడం జరిగిందని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ అంశాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రతి మూడు వార్డులకు ఒక గజటెడ్ అధికారిని రిటర్నింగ్ అధికారిగా, మరొకరిని సహాయ రిటర్నింగ్ అధికారిగా నియమించడం జరిగిందని ,వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రకటించామని, ఈనెల 30వ తేదీన జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు .ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  ఎన్నికల విషయమై ఏదైనా అనుమానాలు ఉంటే తక్షణమే తనకు గాని ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లేదా మున్సిపల్ కమిషనర్ ఎవరికో ఒకరికి ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా జడ్చర్ల మున్సిపాలిటీ ని  ఎనిమిది రూట్లు గా, నాలుగు జోన్లుగా విభజించడం జరిగిందని తెలిపారు.జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలలో  ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కోవిడ్ దృష్ట్యా కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ  మాస్క్ ధరించడం చేసుకోవటం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు  అంతకుముందు కలెక్టర్  మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలిస్తూ నామినేషన్ల సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నామినేషన్ల పరిశీలన సమయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎన్నికలకు అవసరమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికలపై త్వరలోనే  జిల్లా ఎస్ పి తో కలిసి  జడ్చర్లలోనే ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని,ఎస్ ఎస్ టి,ఎఫ్ ఎస్ టి బృందాలతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేస్తామని ,ఎలక్షన్ అధికారులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  బ్యాలెట్ పేపర్ ముద్రణ ,పి ఓ ఏపీవో లకు ఈ నెల 19, 26 తేదీలలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బందోబస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లా ఎస్ పి ఆర్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ,అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని,ఎన్నికల సందర్బంగా  8 రూట్లు ఏర్పాటు చేయటం జరిగిందని, 54 పోలింగ్ కేంద్రాలలో రూట్ మొబైల్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని, సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డి ఎస్ పి శ్రీధర్,మున్సిపల్ కమిషనర్ సునీత,ఎన్నికల శిక్షణాధికారి ఎంపిడివో నటరాజ్, తహసీల్దార్ లక్ష్మినారాయణ,తదితరులు ఉన్నారు.