ఇక పై నిరంతరం నియామకాలు జరిపే ప్రక్రియ... మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
జిల్లా నుండి సాధ్యమైనంత ఎక్కువ మంది నిరుద్యోగ యువత గ్రూప్ 1, గ్రూప్ 2 సాధించేలా చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజ లో శాంత నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిషన్ విద్యార్థులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థ ను పూర్తి చేసినందున త్వరలోనే 100 శాతం నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.ఇక పై నిరంతరం నియామకాలు జరిపే ప్రక్రియ గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద, నిరుద్యోగ యువతకు విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహిత ఇదివరకే నిర్ణయం తీసుకుని ముందుగా ఒక బ్యాచ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు .ఇందుకోసం అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ముఖ్యంగా భోజనం ,వసతి ఉంటుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .మహబూబ్ నగర్ జిల్లా తో పాటు ,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు ,మున్సిపల్ చైర్మన్ కే.సీ .నరసింహులు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఖురేషి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .