ఈ సంవత్సరం రెండు కోట్ల విత్తన బంతుల తయారీ లక్ష్యం- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు...

 ఈ సంవత్సరం రెండు కోట్ల విత్తన బంతుల తయారీ లక్ష్యం- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు...  హరితహారం కార్యక్రమం లో భాగంగా గత సంవత్సరం మహిళ సంఘాల ద్వారా జిల్లాలో కోటీ 18 లక్షల విత్తన బంతులు తయారు  చేసి  వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగిందని, ఆ రికార్డును మనమే బద్ధలుకొట్టేలా ఈ సంవత్సరం రెండు కోట్ల విత్తన బంతులు తయారుచేయాలన్న లక్ష్యంతో  తక్షణమే కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  తెలిపారు.

శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి  విత్తన బంతులు తయారీ,హరితహారం,రహదారులకిరుపక్కల  నాటే మొక్కల పై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ విడత విత్తన బంతుల తయారీ బాధ్యత సెర్ప్,మెప్మా,గ్రామ పంచాయతీలదని, సోమవారం నుండి  మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పెద్ద గ్రామ పంచాయతీలో కనీసం 5000, మధ్య తరహా గ్రామపంచాయతీలో 3,000, 300 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు,తండాలలో  2000 విత్తన బంతులు రూపొందించేలా లక్ష్యాన్ని నిర్దేశించారు.డి ఆర్ డి ఎ ద్వారా కోటి 70 లక్షలు,మెప్మా ద్వారా 30 లక్షల బంతులు తయారు చేయాలి. తాసిల్దార్ లు విత్తన బంతులు చల్లేందుకు స్థలాలు గుర్తించాలని,విత్తన బంతుల తయారీకి అవసరమైన విత్తనాలు సేకరించాలని, వేప ,సీతాఫల్ వంటి విత్తనాలతో పాటు స్థానికంగా దొరికే వాటిని కూడా సేకరించాలని ,ఈనెల 15 నుండి ప్రతిరోజు ఎవరెవరు ఎన్ని బంతులు తయారు చేసింది ఒక ప్రొఫార్మా ఏర్పాటు చేసి సమర్పించాల్సిందిగా డిఆర్డిఓను ఆదేశించారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కల మధ్య ఎక్కడైనా మొక్కలు చనిపోయినట్లయితే కొత్త మొక్కలు నాటాలని, మొక్కల మధ్య దూరం ఎక్కువగా లేకుండా మొక్కలు నాటించాలని, ఇందుకుగాను ఎంపీడీవో, తాసిల్దార్, మండల స్థాయి అటవీశాఖ అధికారి,  ఏఎం పి ఓ లు  వెంటనే  సర్వే చేసి మొక్కలు నాటే స్థలాలను గుర్తించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల తో పాటు, ఇతర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు.ఈ నెల 12 నుండి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే బాధ్యత ఎంపిడివో, తాసిల్దార్ , ఎంపివో ,అటవీశాఖ అధికారులదే అని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో రహదారులకిరుపక్కల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పారు.
ఈ సంవత్సరం హరితహారం కింద మొక్కలు నాటేందుకు తక్షణమే గుంతలు తవ్వడం ప్రారంభించాలని, రేపు సాయంత్రం లోగా 30 లక్షల గుంటలు తవ్వేందుకు అంచనాలు రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. పాలమూరు యూనివర్సిటీ లో 2 లక్షలు, ప్రభుత్వ వైద్య కళాశాలలో లక్ష మొక్కలు నాటేందుకు లక్ష్యంగా తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం నుండి ప్రతిరోజు మూడు నుండి నాలుగు మండలాల చొప్పున హరితహారం పై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హరితహారం కార్యక్రమానికి ఉపాధి హామీ సిబ్బందిని వినియోగించుకోవాలని ఎంపిడివో లను ఆదేశించారు. హరితహారం కార్యక్రమం వల్ల పచ్చదనం పెరగడమే కాకుండా ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. రెవెన్యూ  అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డి ఆర్ డి ఓ యాదయ్య,డి ఎఫ్ ఓ గంగారెడ్డి, డిఆర్ఓ కె.స్వర్ణలత, డి పి ఓ వెంకటేశ్వర్లు,మెప్మా పైడి శంకరాచారి,ఏ పిడి లు అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీవోలు,డిపిఎం లు,ఏ పీఎం లు, పంచాయతీ కార్యదర్శులు,వి ఓ లు ఈ వీడియో కాన్ఫెరెన్సు కు హాజరయ్యారు.