దేశ ప్రధాని మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించే బాధ్యత ను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు పిలుపునిచ్చారు.

  దేశ ప్రధాని మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ  నీటిని సంరక్షించే బాధ్యత ను తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు పిలుపునిచ్చారు.   " ప్రపంచ జల దినోత్సవాన్ని" పురస్కరించుకొని సోమవారం భారత ప్రధాని మోడీ జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా వర్షాన్ని ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకొనే ప్రచారాన్ని ఢిల్లీ నుండి  ఆన్ లైన్ లో ప్రారంభించారు.
      ఈ సందర్భంగా భారత ప్రధాని   మాట్లాడుతూ రాబోయే తరాలకు నీటి ఇబ్బంది లేకుండా జలాన్ని అందించడంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పెట్టుకోవటం తోపాటు, ఉన్న నీటిని  వివేచనతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రోజురోజుకు తరిగిపోతున్న భూగర్భజలాల దృష్ట్యా జలసంరక్షణ తప్ప వేరే  మార్గం లేదని అన్నారు .ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నీటికి ప్రాధాన్యత పెరిగిందని ,దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు  జల సంరక్షణకు కృషి చేయాలని ,ఇది ప్రజలనుండే మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. నీటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ను తీసుకురావడం జరిగిందని అన్నారు.  ఎక్కడ పడిన వర్షపు నీటిని  అక్కడే ఒడిసి పట్టుకోవడంతో పాటు దానిని జాగ్రత్తగా సంరక్షించుకోవటమే కాకుండా ఉన్న నీటిని  వివేకంతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వచ్ఛమైన నీటిని తాగేందుకు నీటిని పరీక్షించేందుకు గ్రామాలలో కనీసం 5 మంది మహిళలకు నీటి పరీక్షలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. నీటి సంరక్షణ ను ఒక సంకల్పంలా ప్రతి ఒక్కరు తీసుకోవాలని, అప్పుడే రాబోయే తరానికి స్వచ్ఛమైన జలాన్ని అందించగలమనితెలిపారు.
      అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో నీటి సంరక్షణకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని, అయినప్పటికీ ప్రతి ఒక్కరూ నీటిని కాపాడుకోవడం పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నీటిని సంరక్షించడం పై  "జలప్రతిజ్ఞ" చేయించారు.
      ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,డి ఆర్ ఓ కె. స్వర్ణలత, జడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.