డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది... ఇది ఆగిపోయే కార్యక్రమం కాదు... రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...
డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇది ఆగిపోయే కార్యక్రమం కాదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా దివిటీ పల్లి గ్రామంలో 66. 62 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1024 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. అంతేకాక 3.60 కోట్ల రూపాయల వ్యయంతో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 19 వేల కోట్ల రూపాయలను వెచ్చించి లక్షా 20 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని, ఇది ప్రపంచ రికార్డు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీటి సరఫరా,రైతు బంధు,రైతు భీమా, కల్యాణలక్ష్మి ,కెసిఆర్ కిట్ వంటివి చేపట్టడం జరిగిందని, 1000 కి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా ఆర్డీఎస్ కింద కుడి కాలువ తవ్వకం, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని ,ఎట్టి పరిస్థితుల్లోనూ మహబూబ్నగర్ , రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల కు నష్టం కలగకుండా చూస్తామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ఆక్రమ ప్రాజక్టుల విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలియజేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి కూడా త్వరలోనే సాక్ష్యాలతో సహా సమర్పించనున్నారని తెలిపారు. అనంతరం మంత్రి 96 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బైపాస్ రహదారి ని ప్రారంభించారు. అంతేకాక హరితహారం కింద బైపాస్ రహదారి వెంట 6 లైన్ ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు . రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని తెలిపారు.దివిటి పల్లి లో తాగునీటి సమస్య వల్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహ ప్రవేశం ఆలస్యమైందని, దివిటిపల్లి తో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాలలో తీర్చిదిద్ది అగ్రభాగాన నిలబెడతామని, పాలమూరు- రంగారెడ్డి కింద కరివేన,ఉదందాపూర్ రిజర్వాయర్ పూర్తయితే రైతులకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో విధంగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. దివిటి పల్లి సమీపంలోనే 400 ఎకరాల్లో ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని గ్రీన్ కార్పొరేషన్ తో 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నామని, తెలిపారు. మహబూబగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు ,రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మాట్లాడుతూ దివిటిపల్లి గ్రామంలో 1024 నిర్మించడం జరిగిందని, మొదటి విడతన 100 మంది లబ్ధిదారులకు ఇండ్లను ఇవ్వడం జరిగిందని,తక్కిన వారికి కూడా ఇళ్లను ఇవ్వడం జరుగుతుందని ,జిల్లాలోని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు .అదేవిధంగా క్రిస్టియన్ పల్లి, వీరన్న పేట లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇదివరకే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని,మిగిలినవి కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు.దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె .సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కె. సి. నరసింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్,డి సి సి బి ఉపాధ్యక్షులు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గదినేష్,దివిటిపల్లి సర్పంచ్ జరీనా బేగం ,ఎంపిపి సుహాసిని, ఆర్డిఓ పద్మశ్రీ, జెడ్పిటిసి వెంకటేశ్వరమ్మ ,వైస్ ఎంపీపీ, కౌన్సిలర్లు, హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటరమణ, ఆర్ అండ్ బి ఈ ఈ స్వామి,డి ఈ సంధ్య,డి ఎఫ్ ఓ గంగి రెడ్డి,మున్సిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్,ఇతర జిల్లా అధికారులు , ప్రజా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.