.కోవిడ్ నివారణకై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్ఠ వ్యవస్థ కు అందరు సహకారం అందించాలి . జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ...
కోవిడ్ నివారణకై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్ఠ వ్యవస్థ కు అందరు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. ఇందుకుగాను 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వాక్సిన్ వేయించుకోవాలని కోరారు . సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి పారిశ్రామికవాడలో కోవిడ్ నివారణలో భాగంగా ఏర్పాటుచేసిన ఔట్ రీచ్ కేంద్రంలో కోవిడ్ టీకా మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు.అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మాస్కు పెట్టుకోకపోవడం ,భౌతిక దూరం పాటించని కారణంగా తిరిగి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని , ఇటీవలికాలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇవ్వటం జరుగుతున్నదని,సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోవిడ్ టీకాను ఇవ్వటంలో ప్రపంచంలోనే భారత దేశమే మొదటి స్థానంలో ఉందని, ఇది మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. జడ్చర్ల మున్సిపల్ ప్రాంతంలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజివి ఆదేశాల మేరకు ఇటీవలే పోలేపల్లి సెజ్ లో ప్రత్యేక ఔట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. పోలేపల్లి పారిశ్రామికవాడలో సుమారు పది వేల మందికి పైగా ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి పనిచేస్తున్నారని అన్నారు.
సెజ్ లోని ఆయా పారిశ్రామిక సంస్థల యజమానులు, క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారి సిబ్బందికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు చేయించుకునేలా చూడాలని, ఆ తర్వాత మాత్రమే కంపెనీ లో పని చేసేందుకు అనుమతించాలని చెప్పారు.కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లయితే తప్పనిసరిగా అలాంటివారిని హోమ్ ఐసోలేసన్ లేదా ఆసుపత్రిలో చేర్పించాలని అన్నారు. టి ఎస్ ఐఐ సి లో పని చేసే ఉద్యోగుల తో పాటు, ఇక్కడికి వచ్చే బయటి వారికి కూడా టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని, ఈ విషయమై పోలేపల్లి సెజ్ లోని టి ఎస్ ఐ ఐ సి కి కోవిడ్ వాక్సిన్ 10 వేల డోసులు కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్ ను కలెక్టర్ ఆదేశించారు. పోలేపల్లి లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు .కోవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పటిష్ట వ్యవస్థకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జడ్చర్ల జెడ్పిటిసి యాదయ్య మాట్లాడుతూ రెండవ దశలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, ముఖ్యంగా ప్రభుత్వం జారీచేసే సూచనలు, సలహాలను తప్పకుండా పాటించాలని ఆయన కోరారు . జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్, డి ఐ ఓ శంకర్ ,పోలేపల్లి పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .