కోవిడ్ చికిత్సలో మరో ముందడుగు.....

 కోవిడ్ చికిత్సలో మరో ముందడుగు..... మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా రోగులకు చాలినన్ని బెడ్లు  రిజర్వ్ చేసేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ డాక్టర్ల సేవలు మరువ లేనివి -- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు  దేశంలోనూ, రాష్ట్రంలోనూ రోజురోజుకు కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.ప్రైవేట్ ఆసుపత్రులలో బెడ్ల సంఖ్యను పెంచటమే లక్ష్యంగా  మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు.  గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జిల్లాలో కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆయన  ఉపక్రమించారు.ఇందులో భాగంగా  శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ,కోవిడ్ నివారణలో అన్ని ఆసుపత్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు.10 కి మించి బెడ్లు ఉన్న ప్రతి ఆస్పత్రి  తప్పనిసరిగా  20 శాతం బెడ్లు కోవిడ్ రోగులకు రిజర్వ్ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.  మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలన్నింటికీ  కేంద్రంగా  ఉన్నందున ప్రజలు  హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్ వైపే కోవిడ్ చికిత్సకోసం చూస్తారని,ఇక్కడికి వస్తారని, అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకుని  ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కరోనా విపత్కర  సమయంలో ప్రభుత్వ వైద్యుల తో పాటు ప్రైవేటు డాక్టర్లు  కూడా ఎవరు  సెలవు పై వెళ్లవద్దని ఆయన కోరారు.  ప్రజలకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆన్నారు. ప్రత్యేకించి ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ చికిత్సల విషయంలో పర్యవేక్షించేందుకు గాను జిల్లా స్థాయిలో మూడు తనిఖీ,పర్యవేక్షక బృందాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ అధికారులతో కూడిన ఈ బృందాలు ప్రతిరోజు  వారి పరిధిలోని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆయన చెప్పారు.మహబూబ్ నగర్ తో పాటు జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ప్రైవేట్ ఆస్పత్రులు లో  కోవిడ్ నిబంధనల ప్రకారం చికిత్సలు చేసేలా చర్యలు తీసుకోవాలని ,అక్కడ కూడా తనిఖీ, పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు .
 అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్  మాట్లాడుతూ  మహారాష్ట్ర లో కోవిడ్ వల్ల  పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని,అలాంటి పరిస్థితులు మన జిల్లాలో రాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో   జిల్లా అధికారులు అందరూ ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఇతర శాఖల అధికారులు సిద్ధం కావాలని కోరారు. జడ్చర్ల ,మహబూబ్ నగర్ ప్రాంతాలలో పరిశ్రమలు  ఎక్కువగా ఉన్నందున వారితో  కూడా సమన్వయం చేసుకొని కోవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని, కోవిడ్ లో సేవలందించేందుకు అందరూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .