శరవేగంగా విస్తరిస్తున్న నూతన సాంకేతికతను రైతులు వినియోగించుకుని కొత్త పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు

శరవేగంగా విస్తరిస్తున్న నూతన సాంకేతికతను రైతులు వినియోగించుకుని కొత్త పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
 మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యాన పంటల కు ఎక్కువ అవకాశాలు ఉన్నందున జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని  అన్నారు.
       బుధవారం ఆయన జడ్చర్ల మండలం కొడుగల్ లో వివిధ ఉద్యాన తోటలను పరిశీలించారు. ముందుగా ఆయన రాజేందర్ రెడ్డి కి సంబంధించిన పుచ్చకాయ, మామిడి, దానిమ్మ తోటలను పరిశీలించారు.
       మహబూబ్ నగర్  జిల్లాల్లో ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలలో ఉద్యాన తోటల పెంపకానికి అనువైన భూములు ఉన్నాయని కలెక్టర్ అన్నారు.నిరంతరం సాంప్రదాయ పంటలే పండించకుండా కొత్త పంటల పై దృష్టి పెట్టాలన్నారు.ఇక్కడి రైతులు నూతన సాంకేతికతను అలవరచుకునేలా అవగాహన కల్పించి  ఉద్యాన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తే మహబూబ్నగర్ జిల్లా రానున్నరోజుల్లో హార్టికల్చర్ హబ్ గా తయారయ్యేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఆ దిశగా ఉద్యాన , వ్యవసాయ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా పంటల కాలపరిమితి, దిగుబడి ,పంటల పండించేందుకు అవుతున్న ఖర్చు, పెట్టుబడి, లాభం తదితర వివరాలను రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

          జిల్లా కలెక్టర్ వెంట ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా,జడ్చర్ల తాసిల్దార్ లక్ష్మీనారాయణ ,ఉద్యాన శాఖ అధికారులు,తదితరులు ఉన్నారు