కరోనాకు భయపడాల్సిన పని లేదు ... ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుంది.... జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు..
కరోనాకు భయపడాల్సిన పని లేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ గంజి లో పర్యటించారు.కరోనా నియంత్రణ ముందస్తు చర్యలలో భాగంగా ఎవరికైనా జ్వరం, దగ్గు ,జలుబు వంటి లక్షణాలు ఉంటే గుర్తించి వారికి ముందుగానే కరోన కిట్లు ఇవ్వటం, కరోనా సోకకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తల పై ప్రజలను చైతన్యం చేసేందుకు గాను ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇదివరకు రెండుసార్లు జ్వర సర్వే నిర్వహించడం జరిగిందని, ఈ సర్వే సందర్బంగా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చారా ? కరోన రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీకేమైనా కరపత్రం ఇచ్చారా ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు? మీ ఇంట్లో ,చుట్టూ పక్కల ఎవరికైనా జ్వరం,దగ్గు,జలుబు ఉన్నాయా? ఉంటే మందులిచ్చారా? అని కలెక్టర్ వార్డ్ లోని ముంతాజ్,జంగిలమ్మల ఇండ్లకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా వచ్చిన భయపడాల్సిన అవసరం లేదని, డాక్టర్ సలహా మేరకు మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆక్సిజన్, మందులు బెడ్లు అన్నీ అందుబాటులో ఉన్నాయని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.కరోనా సోకకుండా ముందు జాగ్రత్త లు తీసుకోవాలని, ఇంట్లోనే ఉండాలని, బయటకు రావద్దని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వేసుకోవడం చేస్తూ ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం అంగన్వాడి,ఆశ ఏ ఎన్ ఎం లతో కూడా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య సర్వే లో ఎంతమంది అంగన్ వాడి కార్యకర్తలు,ఆశలు పాల్గొంటున్నారని అడిగారు.డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్, డాక్టర్ ప్రగతి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.