కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ--రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్...

కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ--రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్... 
 గత కొద్ది రోజులుగా దేశంలోను,పక్క రాష్ట్రాలలోను కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం  రాత్రి కర్ఫ్యూ విధించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు  అమలులో ఉంటుందని,ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు.  కరోనా దృష్ట్యా మంగళవారం  మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని   వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫెరెన్సు  ద్వారా నిర్వహించగా,మంత్రి ఈ కాన్ఫెరెన్సు లో మాట్లాడుతూ  రాను రాను కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మాస్కు ధరించటమే కాక, భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని, జిల్లాలోని మండల, గ్రామ స్థాయిలో టాంటాం వేయించి మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం పై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. జడ్పిటిసి, ఎం పి పి,ఎంపీటీసీలు ప్రజల ఆరోగ్య సమస్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఉన్నట్లనిపిస్తే వారికి కొవిడ్ టెస్ట్  చేయించాలని చెప్పారు. కోవిడ్ కోసం ప్రత్యేకించి మూడు అంబులెన్స్ లను  సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ప్రజలు కరోనా బారిన పడకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రజలు ఇబ్బంది పడకుండా జడ్పీటిసి, ఎంపీపీలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చూడాలని, అదేవిధంగా  భౌతిక దూరం పాటించడం,సానిటైజర్ వాడాలని చెప్పాలని ఆమె అన్నారు.కోవిడ్ కారణంగా  ఆసుపత్రులలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు .గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కూలీలు ఇతర ప్రాంతాలనుండి జిల్లా కు వచ్చే అవకాశం ఉన్నందున గతంలో మాదిరిగా బియ్యం వంటివాటి పంపిణీ విషయం ఆలోచించాలని కోరారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీలో చొరవ తీసుకోవాలని కలెక్టర్ తో కోరారు.అనంతరం  వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష సందర్భంగా రైతులందరికీ రుణాలు వచ్చేలా చూడాలని, అదేవిధంగా రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ,ధాన్యం కొనుగోలు సందర్భంగా గాన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని కోరారు. విద్యుత్ అంతరాయం వల్ల ఎక్కడ పంటలు ఎండి పోకుండా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.   జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 150 పడకల  కోవిడ్ ఆస్పత్రికి మరో ఓ వంద పడకలు అదనంగా చేరుస్తున్నామని మంత్రికి వివరించారు. మండల మరియు గ్రామ  స్థాయిలో రాత్రి సమయం లో కర్ఫ్యూ విధించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మంత్రికి తెలిపారు.ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగకుండా రైతు కోసమే అందరూ పని చేయాలని కోరారు.మండల స్థాయిలో ఏమైనా సమస్యలొస్తే డివిజన్ స్థాయి ,జిల్లా స్థాయి కమిటీ దృష్టికి తీసుకు రావాలని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్బంగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వారి ప్రాంతానికి సంబంధించిన సమస్యలను  సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తెచ్చారు. రైతుల సమస్యలు, రైతు బంధు, రైతు బీమా, కరోనా, నీరు, కరెంట్, వైద్యం, ఉపాధి హామీ పథకం ,రహదారులు,ధాన్యం కొనుగోలు వంటి అంశాల పై మాట్లాడారు.ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామారావు, డి ఆర్ ఓ కే. స్వర్ణలత, జడ్పీటీసీలు ,ఎంపీటీసీలు ,ఎంపీపీలు సంబంధిత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.