బస్తీ దవాఖానల్లో నిపుణులైన వైద్యులతో సేవలు- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
బస్తీ దవాఖానల్లో నిపుణులైన వైద్యులతో సేవలు- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 4 బస్తీ దవాఖానల లో ఇకపై నైపుణ్యం కలిగిన డాక్టర్లతో ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై శనివారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ప్రైవేటు క్లినిక్ ల మాదిరిగానే మహబూబ్ నగర్ పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్తి దవాఖానాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎనుగొండ, టి డి గుట్ట, వీరన్న పేట,దోబీ వాడలలో బస్తి దవాఖానాలను ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఆసుపత్రుల నిర్వహణకు గాను ఒక డాక్టర్ తో పాటు, మహిళా డాక్టర్, నర్స్ ,ఇతర సిబ్బందిని నియమించడం జరిగింది .ఇకపై ఈ ఆస్పత్రుల ద్వారా ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు ఒక్కో బస్తి దవాఖాన లో ఒక ప్రైవేట్ ఆస్పత్రి ద్వారా నిపుణులైన డాక్టర్ల చేత ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఉచిత సేవలు అందించేందుకు నిర్ణయించడం జరిగింది. ఇందుకు గాను ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి వైద్య సేవలు అందించాలని కోరారు. ఇందుకు ప్రైవేటు హాస్పిటల్ మేనేజ్మెంట్ లు కూడా అంగీకరించగా, ఎనుగొండ లోని బస్తి దవాఖానలో ఎస్వీఎస్ ఆస్పత్రి ద్వారా ప్రత్యేక వైద్య సేవలందించేందుకు అంగీకరించారు. అలాగే నేహ సన్ షైన్ ఆసుపత్రి ద్వారా టి డి గుట్ట, సుశ్రుత ప్రజా వైద్యశాల ద్వారా వీరన్నపేట, నవోదయ ఆసుపత్రి ద్వారా దోబీ వాడ బస్తీ దవాఖాన లలో ప్రత్యేక డాక్టర్ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు అంగీకరించారు. ఇక పై బస్తి దవాఖానాలలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిపుణులైన డాక్టర్లు వారి సేవలను అందిస్తారు. ముఖ్యంగా జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఆర్తోపెడిక్, పీడియాట్రిక్ ,గైనకాలజీ వంటి విభాగాలలో వైద్య సేవలందించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. ఇందుకు జిల్లా కలెక్టర్ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను అభినందించారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా నియంత్రణలో కూడా సంపూర్ణ సహకారం అందించాయని , బిల్లుల తగ్గింపు, అలాగే సిటీ స్కాన్ ధరల తగ్గింపు, పరీక్షల ధరల తగ్గింపు విషయంలో సంపూర్ణ సహకారం అందించాయని, ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల వల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై కరోన రోగుల భారం తగ్గిందని, అలాగే ఆక్సిజన్ వినియోగించే శాతం కూడా తగ్గిందని, ఇందుకుగాను ప్రైవేటు ఆసుపత్రులను ఆయన అభినందించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ తో పాటు, శుశ్రుత హాస్పిటల్ అధినేత మధుసూదన్ రెడ్డి,నేహ సన్ షైన్ ఆసుపత్రి డాక్టర్ విజయ్ కాంత్, నవోదయ ఆసుపత్రి నుండి ప్రశాంత్ రెడ్డి , ఎస్ వి ఎస్ నుండి ఆర్ ఎం ఓ తదితరులు హాజరయ్యారు.