అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

 అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కెసిఆర్  ఎకో పార్కులో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రపంచ అటవీ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల కాలంలో ఆకతాయిల కారణంగా అడవులు నాశనం అవుతున్న విషయాన్ని మనం మీడియాలో చూస్తున్నామని , కొంతమంది నిర్లక్ష్యం వల్ల అడవులు నాశనమవుతున్నాయని, ఈ నిర్లక్ష్యాన్ని వీడి ప్రతి ఒక్కరు అడవులను సంరక్షించుకోవడం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు .   రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగానే మొక్కలు నాటడం తోపాటు, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులపై కూడా ఉందని, ఒకవేళ  మొక్కలను సంరక్షించకపోతే అధికారం కోల్పోయే ప్రమాదం  ఉందని ఆయన తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో నాటిన మొక్కలు సుమారు 92 శాతం బ్రతికాయని  అన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో కోటి విత్తన బంతులను తయారు చేయడమే గాక తయారు చేసిన  విత్తన బంతులను బంజరు భూములు, అటవీ భూముల లో చల్లడం జరిగిందని వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన స్వయం సహాయక బృందాలతో పాటు అడవుల సంరక్షణకు పాల్పడుతున్న అటవీశాఖ అధికారులను,సిబ్బందిని ఆయన అభినందించారు. మనిషి జీవితాన్ని కాపాడే అడవులను సంరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో  ఎకో పార్క్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, అదేవిధంగా పూర్తి అవసాన దశకు చేరుకున్న ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లల మఱ్ఱి ని   సంరక్షించుకోవడం తోపాటు, మళ్లీ పూర్వ దశకు తీసుకురావడం జరిగిందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం తో ఎకో పార్కుతోపాటు, పిల్లలమర్రి  ఇంకా ఎన్నో చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయని  అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షిస్తే భవిష్యత్తులో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి  చెందేందుకు ఆస్కారముందని అన్నారు.

      ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ కె.సి నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మొక్కలను పెంచుతున్నదని తెలిపారు. వృక్షాలను పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గిపోతుందని అన్నారు. జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో 2097 ఎకరాలలో ఎకో పార్కు ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామని, అదేవిధంగా కరోనాను కూడా కట్టడి చేశామని తెలిపారు.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అటవీశాఖ అధికారి సిహెచ్. గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల శాతం పెరిగిందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడవుల సంరక్షణ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, అడవుల సంరక్షణకు అటవీ శాఖలోని ఖాళీలను భర్తీ చేయడం చేయడంవల్ల అడవులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించే వాటరింగ్ డే లో అందరూ పాల్గొనాలని ,ప్రత్యేకించి ప్రజాప్రతినిధులు ,అధికారులు అందరూ పాల్గొని మొక్కలకు నీళ్ళు పెట్టాలని కోరారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.   డిపి ఆర్ ఓ యు.వెంకటేశ్వర్లు,చిన్నచింతకుంట జెడ్ పి టి సి రాజేశ్వరి,  ఎఫ్ ఆర్ వో  లు చంద్రయ్య, నారాయణ రావు, అప్పనపల్లి కౌన్సిలర్ రామాంజనేయులు, జడ్చర్ల కాలేజీ ప్రొఫెసర్ సుభాషిని తదితరులు మాట్లాడారు.  సమాచార శాఖ ఆధ్వర్యంలో టీఎస్ కళాబృందం ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ లు ఎకో పార్క్ లో మొక్కలను నాటారు.