ఈ నెల 23 నుండి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిపోతున్నందున జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును పరుగులు పెట్టించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జిల్లా అధికారులతో కోరారు.

  ఈ నెల 23 నుండి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిపోతున్నందున జిల్లాలో ప్రభుత్వ  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును పరుగులు పెట్టించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు జిల్లా అధికారులతో కోరారు.

        సోమవారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సమస్యలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని సరైన విధంగా పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని, తక్షణమే పరిష్కరించవలసిన వాటిని  జాప్యం లేకుండా పరిష్కరించాలని, అవకాశం లేని వాటికి  ఫిర్యాదుదారులకు ఖచ్చితమైన ఎండార్స్మెంట్ ఇవ్వడంతోపాటు, ఎప్పటికప్పుడు ప్రజావాణి పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు  ఆన్లైన్  ప్రజావాణి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల జిల్లా అధికారులందరూ గతంలో మాదిరిగానే  సోమవారం ఉదయం 11 నుండి 1 గంట వరకు ఫోన్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.అలాగే ఇకపై ప్రతి గురువారం ప్రజా వేదిక కార్యక్రమం కూడా తిరిగి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. చిత్తశుద్ధితో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పని చేసిన కార్యక్రమాలన్ని జిల్లాలో విజయవంతం అవుతాయని అధికారులు నిరూపించారని, ముఖ్యంగా గత సంవత్సరం కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అధికారులందరూ ఆత్మస్థైర్యంతో పనిచేసి విజయవంతంగా కరోనాను ఎదుర్కోవటంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటు పడకుండా అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం  వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో జిల్లా మంచి పురోగతిలో ఉందని తెలిపారు. కరోనాకేసులు తిరిగి పెరుగుతున్నందున గత వారం రోజుల కింద సమావేశం నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ,కార్యాచరణ ప్రణాళిక రూపొందించగా, ఇప్పటివరకు నూటికి నూరు శాతం అన్నీ పాఠశాలలు, కళాశాలలో ఆర్ బి ఎస్  కె సర్వే నిర్వహించి విద్యార్థులను పరీక్షించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సెర్ప్ ల్ వెనుకబడిపోయిన మండలాలలో స్పష్టమైన పురోగతి  తీసుకురావడం జరిగిందని అన్నారు.ఇంకా కొన్ని ఇంజనీరింగ్ శాఖలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
       హైకోర్టు, రాష్ట్ర మానవ హక్కుల సంఘం, అదేవిధంగా జాతీయ ,రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన అంశాలపై అధికారులు అందరూ  అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వాటి పట్ల నిర్లక్ష్యం లేకుండా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు .
     ఈ- ఆఫీస్ పై  సమీక్షిస్తూ అన్ని ఫైళ్లు ఈ -ఆఫీస్ లోనే పంపడంతో పాటు, అంతర్గతంగా నిర్వహించే ఫైల్లు కూడా ఈ- ఆఫీస్ లోనే పంపించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
      ఈ సందర్భంగా  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రజావాణి ,ప్రజా వేదిక రెండు కార్యక్రమాలలో ఆయా శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై చదివి వినిపించారు.ఆయా శాఖల అధికారులు వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.
       ఈ సమావేశానికి డి ఆర్ ఓ  కె.స్వర్ణలత,జెడ్ పి సి ఈ ఓ యాదయ్య, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు.