అభివృద్ధికి అందరూ కలిసి రండి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపు...
అభివృద్ధికి అందరూ కలిసి రండి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపు...మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరు సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద 14 లక్షల 25 వేల 500 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అంతేకాక 9 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఫ్రంట్లైన్ వర్కర్లయిన ఆశ, మున్సిపల్ కార్యకర్తలకు ఫ్రూట్ జ్యూస్ ను పంపిణీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కు నర్సింగ్ కళాశాల ను మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే . చంద్రశేఖరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సింగ్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని ఖరారు చేయడం జరిగిందని, దీంతోపాటు పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 10 ఎకరాల స్థలంలో నూతనంగా ఆసుపత్రి నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజల సంక్షేమం లో భాగంగా కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని, గతంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఆస్తులు అమ్మి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఉచిత వైద్యం తో పాటు, కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సాగునీరు ఇస్తున్నామని, పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలను సబ్బండ వర్గాలకు అమలు చేస్తున్నామని తెలిపారు .కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని అభినందించారు. జిల్లాలో దిగ్విజయంగా జ్వర సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాన్యం కొనుగోలు లో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో లక్ష 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ,ఇందుకు సంబంధించి రైతులు అకౌంట్లో డబ్బులు కూడా వేశామని చెప్పారు.గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పొలాల్లోనే అప్పులవాళ్ళు తీసుకువెళ్లే సంస్కృతి ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం రైతులను అన్ని రకాల ఆదుకుంటున్నదని తెలిపారు .గతంలో విద్యుత్తు సరఫరా సక్రమంగా ఉండేది కాదని, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కాలువల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, ప్రతి సంవత్సరం రెండు పంటలు పండించేందుకు రైతులకు అవకాశం కల్పిస్తామని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కె.సినరసింహులు,వైస్ చైర్మన్ గణేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు ,రెడ్ క్రాస్ చైర్మన్ నట రాజ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెక్కెం జనార్దన్ తదితరులు హాజరయ్యారు.