టీనేజ‌ర్లే టార్గెట్.. జ‌డ్చ‌ర్ల‌లో సైకోలు

 మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల‌లో మైన‌ర్ గ‌ర్ల్స్ ట్రాపింగ్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం రేపుతోంది. టీనేజీ అమ్మాయిలే టార్గెట్ కొంద‌రు యువ‌కులు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్న విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా మైన‌ర్ల‌ను ప‌రిచ‌యం చేసుకోవ‌డం, ఆపై వారిని లోబ‌రుచుకోవ‌డమే ప‌నిగా పెట్టుకుని ఆ దుర్మార్గులు కొన్ని నెల‌లుగా వికృతానందాన్ని పొందుతున్నారు. ఈ డేంజర్ గ్యాంగ్ బారిన‌ప‌డిన వారంతా మైన‌ర్ బాలిక‌లే కావ‌డం.. వారికి జ‌రిగిన అన్యాయాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పుకోలేక‌పోవ‌డంతో వారి దుష్ట చేష్ట‌లు నిరాటంకంగా సాగిపోతూ వ‌చ్చాయి. త‌న కూతురు క‌నిపించడం లేద‌ని ఓ తండ్రి.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో గ్యాంగ్ ఆగ‌డాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ద‌ర్యాప్తుచేసే కొద్ది పోలీసుల‌కే దిమ్మ తిరిగే విష‌యాలు తెలుస్తున్నాయి.

జ‌డ్చ‌ర్ల‌కు చెందిన పంచాయతీ సెక్రటరీ సంపంగి మహేశ్‌.. రాజాపూర్‌కు చెందిన‌ ప్రైవేటు టీచర్ మహేష్ రాజు త‌మ‌ స్నేహితులతో క‌లిసి ఈ దారుణ ప‌ర్వాన్ని సాగిస్తున్న‌ట్టు తేలింది. సంపంగి మ‌హేష్‌కు కొద్ది రోజుల క్రిత‌మే వివాహం కాగా, అత‌ని భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు లేక‌పోవ‌డంతో మ‌హేష్ రాజు… త‌న స్నేహితుడైన‌ సంపంగి మహేశ్‌తో క‌లిసి ఉంటున్నాడు. ఖాళీగా ఉండ‌టంతో మ‌హేష్ రాజు మ‌న‌సులో నీచమైన ఆలోచ‌న పుట్టింది. తాను టీచర్‌గా పనిచేసిన కాలంలో.. త‌న వద్ద పాఠాలు నేర్చుకున్న బాలికల ఫోన్‌ నెంబర్ల‌ను సేక‌రించాడు. వారికి మాయమాటలు చెప్పి.. వారుండే ఇంటివద్దకు రప్పించుకునేవాడు. ఆ త‌ర్వాత సంపంగి మ‌హేష్‌తో క‌లిసి వారిపై లైంగిక దాడి చేసేవారు. అలా 10 మంది వ‌ర‌కు మైన‌ర్ల జీవితాలో ఆట‌లాడుకున్నారు ఈ కీచ‌కులు. రాను రాను త‌మ స్నేహితుల‌ను కూడా త‌మ‌తో చేర్చుకుని ఘోరాలకు పాల్ప‌డ్డారు.
ఇటీవ‌ల వీరి ట్రాప్‌లో ప‌డిన‌ జ‌డ్చ‌ర్ల‌ చెందిన ఓ బాలిక.. ఈ గ్యాంగ్ వెంట హైద‌రాబాద్‌కు వెళ్లింది. దీంతో కూతురు క‌నిపించ‌క‌పోవ‌డంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు..అలా రంగంలోకి దిగిన పోలీసులకు . వారి ఘ‌న‌కార్యం అంతా తెలిసింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయితీ సెక్రటరీ సంపంగి మ‌హేష్ పోలీసుల కస్టడీలో ఉండగా.. మహేశ్ రాజు పరారీలో ఉన్నట్లు సమాచారం. మిగిలిన‌వారి కూడా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ త‌న‌కున్న ప‌లుకుబ‌డితో కేసును నీరుగార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. పోలీసులు ప్ర‌స్తుతం ఈ విష‌యాన్ని ఇంకా ర‌హ‌స్యంగానే విచారిస్తున్నారు.