నారాయణపేట జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోండి

 నారాయణపేట జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోండి

 హెచ్చార్సీలో పిటిషన్ వేసిన రాచాల యుగంధర్ గౌడ్
 మంత్రి కేటీఆర్ పర్యటనలో  మహిళల గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదు
 
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తూ...మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన నారాయణపేట జిల్లా కలెక్టర్ మరియు ఐసీడీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కోరారు.
ఈ మేరకు ఆయన  సోమవారం హైదరాబాద్ లోని హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడుతారో అక్కడ సమాజం సర్వతోముఖాభివుద్ది  చెందుతుందని పెద్దలు చెబుతుంటారని, కానీ అలాంటి స్త్రీలను మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి ,వారి చేతల్లో మొక్కలు పట్టించి మండుటెండలో నడిరోడ్డుపై ఆటబొమ్మల్లా గంటల తరబడి నిలబెట్టి మానసిక క్షోభకు గురి చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.
మానవ మనుగడకు పురుడు పోసే స్త్రీలను మంత్రి గారి మెప్పు కోసం రోడ్డుపై నిలబెట్టడమంటే వారిని శారీరకంగా, మానసికంగా హింసించడమేనన్నారు.
ప్రజల కోసం పని చేయాల్సిన అంగన్ వాడీ టీచర్లను,ఆయాలను, ఆశా వర్కర్లను టీఆర్ఎస్ కార్యకర్తలుగా మార్చడం దారుణమైన ఘటనగా భావిస్తున్నామన్నారు.
తనకు స్వాగతం పలుకడానికి స్త్రీలను చాలా సమయం రోడ్డుపై నిలబెట్టారని తెలిసి కూడా గౌరవించాల్సిన స్థాయిలో ఉన్న మంత్రి కేటీఆర్ మౌనంగా ఉండడమంటే స్త్రీల పట్ల వారికున్న చులకన భావం తెలియజేస్తుందని అన్నారు.
 మంత్రి, ఎమ్మెల్యే మరియు అధికారుల ఇండ్లలో ఉన్న స్త్రీలకు ఒక న్యాయం పొట్ట కూటి కోసం పని చేస్తున్న చిరు ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. 
కావున మహిళలను చిన్న చూపు చూస్తూ వారి అవసరాలు, ఆనందాల కోసం నడిరోడ్డుపై గంటల తరబడి నిలబెట్టి, మహిళలను అవమానించి, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన నారాయణ పేట కలెక్టర్,నారాయణపేట ఎమ్మెల్యే మరియు ఐసీడీఎస్ అధికారులపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలరాజు గౌడ్, శివకృష్ణ,రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.