ఘనంగా జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు .... జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
 2 న ఉదయం 8:15 నిమిషాలకు రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఉన్న అమరవీరుల  స్మారక స్థూపం వద్ద నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, అలాగే పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గడచిన 9 ఏళ్లలో జిల్లాలో సాధించిన అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి జిల్లా ప్రజలను  ఉద్దేశించి సందేశం ఇస్తారని, అనంతరం 10 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 10.30 గంటలకు ఆయా శాఖల ద్వారా ఏర్పాటుచేసిన స్టాల్స్ సందర్శన కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు  అన్ని ఏర్పాట్లు పూర్తి  చేసినట్లు  వెల్లడించారు.