మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో 'అవినీతి' షెడ్డు!

 ప్రభుత్వ ఆసుపత్రిలో అక్రమాల 'షెడ్డు'.. నాణ్యతకు పాతరేసి రూ. 20 లక్షల లూటీ!

మహబూబ్ నగర్ ప్రతినిధి:
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులు వివాదాస్పదంగా మారాయి. రోగులకు సౌకర్యార్థం రూ. 20 లక్షల భారీ వ్యయంతో చేపట్టిన ఎం.ఎస్. షెడ్ (MS Shed) నిర్మాణం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులు.. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తికి, అధికారుల మామూళ్ల మత్తుకు బలైపోతున్నాయి.
 
పాత రాళ్లతోనే కొత్త పునాదులు!
కొత్తగా నిర్మించే షెడ్ కోసం పటిష్టమైన పునాదులు వేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు తమ లాభాల కోసం పాత బేస్మెంట్ రాళ్లనే యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. పాత మెటీరియల్‌ను వాడుతూ కొత్త బిల్లులు డ్రా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
నాణ్యతకు తిలోదకాలు.. అంతా తూతూమంత్రమే!
నిర్మాణంలో వాడాల్సిన నాణ్యమైన ఇసుకకు బదులుగా, అత్యంత తక్కువ ధరకు లభించే ఫిల్టర్ ఇసుక మరియు డస్ట్ (రాతి పొడి)ను వాడుతున్నట్లు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.
 
నాణ్యత లోపం: సిమెంట్ మిశ్రమంలో డస్ట్ వాడటం వల్ల నిర్మాణం పటిష్టత కోల్పోయి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.
 
నిర్లక్ష్యం: అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా, పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ విభాగం కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
 
మామూళ్ల మత్తులో ఆసుపత్రి అధికారులు?
ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మిన్నకుండిపోవడం వెనుక 'మామూళ్ల మత్తు' ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా, అటు కాంట్రాక్టరును అడిగే నాథుడే లేడు. తూతూమంత్రంగా పనులు ముగించి చేతులు దులుపుకోవడమే లక్ష్యంగా ఈ నిర్మాణం సాగుతోంది.
 
ప్రజల డిమాండ్: > వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ నిర్మాణ పనులపై విచారణ జరిపించాలని, నాణ్యత లేని మెటీరియల్‌ను తొలగించి నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.