సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ పనుల నిమిత్తం ఉపయోగించాలి... కలెక్టర్ జి. రవి నాయక్

 సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ పనుల నిమిత్తం ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు.

గురువారం సాయంత్రం తన ఛాంబర్ లో తహసిల్దార్లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో ఇసుక ఎట్టి పరిస్థితులలో దుర్వినియోగం కాకూడదని, పట్టుకున్న ఇసుకను తహసిల్దార్లు తమ అనుమతితో ప్రభుత్వ పనులకు ఉపయోగించాలని ఆదేశించారు.
మీ- సేవ ద్వారా జారీచేసే ఆదాయం, కులం ధ్రువ పత్రాల విషయంలో తహసిల్దారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు 
 సర్వే కోసం రైతులు చేసుకొన్న దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మండలాల్లోని సర్వేలు ఎప్పటికప్పుడు సర్వే పనులను పూర్తిచేసేలా చూడాలని, రోజుకు కనీసం రెండు సర్వేలైనా పూర్తిచేసేలా తహసిల్దారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
 పెండింగ్లో ఉన్న ఈ -ఆఫీసు ఫైళ్లను త్వరితగతిన క్లోజ్ చేయాలని, ముఖ్యంగా 60 రోజులకు మించి పెండింగ్లో ఉన్న వాటిపై ముందు దృష్టి సారించి వాటిని క్లోజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు .
 భూసేకరణకు సంబంధించి ఎక్కడైనా పెండింగ్ ఉన్నట్లయితే తక్షణమే పూర్తి చేయాలని అన్నారు.  ధరనికి సంబంధించిన దరఖాస్తులపై మాట్లాడుతూ పెండింగ్ స్లాట్ ల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,ఎక్కడైనా రైతులు భూమిపై రుణాలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా సంబంధిత బ్యాంకు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకు వచ్చిన తర్వాతనే ధరణి ట్రాన్సాక్షన్స్ చేయాలని సూచించారు. 
          కల్యాణ లక్ష్మి షాది ముబారక్ లో ఇంకా 672 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో అర్బన్ హౌసింగ్ కింద లబ్ధిదారుల వివరాల అప్లోడింగ్ పై సమీక్షించారు .
 రెవెన్యూఅదనపు  కలెక్టర్ కె. సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ ,ఆర్డీవో అనిల్ కుమార్ ,మైనింగ్ ఎడి విజయకుమార్, పంచాయతీరాజ్, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరేందర్ రెడ్డి ,వైద్యం భాస్కర్, కలెక్టర్ కార్యాలయ ఏ ఓ శంకర్, ఆయా సెక్షన్ల  అధిపతులు, తహసిల్దార్లు హాజరయ్యారు.