6వ తేదీ నుండి ఏప్రిల్ 5 వరకు జిల్లా వ్యాప్తంగా నిషేధిత ఆజ్ఞలు
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈనెల 6వ తేదీ నుండి ఏప్రిల్ 5 వరకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిషేధిత ఆజ్ఞలను జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.
1861పోలీస్ చట్టం రూల్ 30 లోని నిబంధనల మేరకు నిషేధాజ్ఞల సమయంలో డిఎస్పి లేదా ఎస్ పి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు,సమావేశాలు , ర్యాలీలు నిర్వహించకూడదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయుధాలు , పేలుడు సామాగ్రి ,కర్రలు వంటివి తీసుకువెళ్లడం నిషేధమని, రోడ్లు, పబ్లిక్ స్థలాలలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం, సమూహాలు గా ఏర్పడటం వంటివి నిషేధం అని తెలిపారు. లౌడ్ స్పీకర్లు,డీజే ల ద్వారా సందేశాలు ఇవ్వడం, మైకులు వినియోగించడం, ఏదైనా సంస్థలు వాహనాలకు పబ్లిక్ అడ్రస్ సిస్టం లేదా హారన్ల ను వినియోగించడం నిషిద్ధమని ఆయన వెల్లడించారు. ఎవరైనా పై నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లయితే 1861 పోలీస్ చట్టం ప్రకారం శిక్ష అర్హులవుతారని ఎస్పీ వెల్లడించారు.అయితే పై నిషేధాజ్ఞలనుండి విధులలో ఉన్న పోలీసు అధికారులు ,మిలిటరీ లో పని చేసేవారు, హోంగార్డులు, ముందస్తు అనుమతి పొందిన అంతిమయాత్ర ర్యాలీలకు మినహాయింపు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పై ఉత్తర్వులు ఈనెల 6న సాయంత్రం 6 గంటల నుండి ఏప్రిల్ 5 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని ఎస్పీ వెల్లడించారు.