మంత్రి నిరంజన్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి
మంత్రి నిరంజన్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి
నిరుద్యోగులంటే అంత చులకననా?
దొరికితే దొంగా...దొరకకపోతే దొరనా?
మాట్లాడింది చూపిస్తే మీడియాపై నిందలా?
నిరుద్యోగులకు, మీడియాకు మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్
నిరుద్యోగుల పోరాటాలు...అమరుల త్యాగాలపై గద్దెనెక్కి మంత్రి పదవి చేపట్టి...అధికార మదంతో కండకావరమెక్కి నిరుద్యోగ యువతను కించపరచడమే కాకుండా వారి ఆత్మాభిమానాలు హరించేలా మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో రాచాల మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రధాన ఎజెండాతో పోరాటాన్ని ప్రారంభించి తెలంగాణ అమాయక యువకుల ప్రాణత్యాగాలతో పీఠమెక్కిన టిఆర్ఎస్ పార్టీ నేడు అదే యువకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్నాయని నోరుజారిన మంత్రి మళ్లీ మీడియా వక్రీకరించిందంటూ కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు.మంత్రికి ఇవేమీ కొత్త కాదని గతంలో కూడా పలు సందర్భాల్లో అవహేళన చేస్తూ వస్తున్నారని ఆరోపించారు.ఈ మధ్యకాలంలో మంత్రులు అధికార,ధన మదంతో ఒకరు మహిళలను కించపరిస్తే...మరొకరు మహిళలను రోడ్డు వెంబడి గంటల తరబడి నిలబెడుతూ వారి హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని రాచాల ఆరోపించారు. ప్రధానంగా వనపర్తిలో నిరంజన్ రెడ్డి మంత్రి అయ్యాక అక్రమ సంపాదనతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, విద్యార్థులు, నిరుద్యోగులు,ఉద్యోగులు, మేధావులు, తెలంగాణ వాదులు, అమరవీరుల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణకు తూట్లు పొడిచే విధంగా నేడు మంత్రుల వ్యవహారశైలి మారిందని విమర్శించారు. మరీ ముఖ్యంగా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహారశైలి రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుందని, ఒకసారి మంత్రి నిరంజన్ రెడ్డి గతం గుర్తుకు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.ఇకనైనా మంత్రి తన తప్పును ఒప్పుకుని నిరుద్యోగ యువతపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన తెలిపారు.అంతేకాకుండా నిరుద్యోగులను అవహేళన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని రాచాల డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ సంరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి రాఘవేందర్ గౌడ్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్న నాయుడు, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, మదనాపూర్ మండల అధ్యక్షుడు మహీందర్ నాయుడు, వెంకటేశ్వర చారి, నక్క రాములు తదితరులు పాల్గొన్నారు.