ఎమ్మెల్యే అండతోనే రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి....బిసి పొలిటికల్ జెఏసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
దేవరకద్ర ఎమ్మెల్యే అండదండలతోనే నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని, అక్రమ మైనింగ్ తవ్వకాలను సహకరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.శనివారం నాడు సీసీ కుంట మండలం అమ్మాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 89 లో చేపట్టిన అక్రమ మైనింగ్ తవ్వకాలను గ్రామస్తులతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి కొండల్లో అక్రమ మైనింగ్, బ్లాసింగ్ పనులు జరుగుతున్నాయని, బ్లాస్టింగ్ లకు వాడే పేలుడు పదార్థాలతో ఏకంగా అమ్మాపూర్ గ్రామంలో ఇండ్లు కంపిస్తుండడంతో పాటు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కంటికి కునుకు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని,భయంకరమైన మైనింగ్, బ్లాస్టింగ్ పేలుళ్లకు ఏకంగా కురుమూర్తి స్వామి గర్భ గుడి సైతం ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.పచ్చని పంట పొలాల కోసం వేసిన వ్యవసాయ బోర్లు సైతం పూడుకపోయి రైతులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.గత కొన్ని రోజులుగా తమ గోడు వినిపించుకునేందుకు రైతులు కుటుంబాలతో సహా రోడ్డుపై టెంట్ వేసుకుని ఆందోళనలు చేస్తున్నప్పటికి స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోకపోవడంపై రాచాల ఆగ్రహం వ్యక్తం చేశారు.నియోజకవర్గంలోని ఇసుక, మట్టిని మొత్తం దోచేసిన ఎమ్మెల్యే గుట్టలను సైతం కొల్లగొడుతూ చివరికి కురుమూర్తి స్వామితో పెట్టుకున్నాడని, గతంలో కురుమూర్తి స్వామి ఆశీస్సులతో గెలిచినటువంటి ఎమ్మెల్యే నేడు అదే కురుమూర్తి స్వామి ఆగ్రహంతో ఓటమి చవిచూడాల్సి వస్తుందని, డిపాజిట్ కూడా కోల్పోతారని హెచ్చరించారు.ఇప్పటికైనా దేవరకద్ర ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి, అక్రమ మైనింగ్ ఆపాలని, లేని పక్షంలో ప్రజల అగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో బిసి పొలిటికల్ జేఏసీ నాయకులు అంజన్న యాదవ్, మహీందర్ నాయుడు, శేఖర్ గౌడ్, స్వామి నాయుడు, అమ్మాపూర్ గ్రామస్తులు మల్లెల బాలరాజు, జెప్పటి శ్రీనివాసులు, జనార్ధన్, ఆంజనేయులు బాలకృష్ణ, దశరథ, కురుమూర్తి, వెంకటేష్, ఆంజనేయులు శివ తదితరులు పాల్గొన్నారు.