హైదరాబాద్ కు దీటుగా మహబూబ్ నగర్ జిల్లాలో వైద్య సేవలు
హైదరాబాద్ కు దీటుగా మహబూబ్ నగర్ జిల్లాలో వైద్య సేవలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు .
ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు నూతనంగా ఏర్పాటు చేసిన పార్కులో మొక్కలు నాటారు.
ఆసుపత్రి ముందు భాగంలో పెద్ద ఎత్తున పార్క్ ను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకులు విశ్రాంతి పొందేందుకు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో వైద్య రంగంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ముఖ్యంగా కరోన సందర్భంగా ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు ,మందులు, ఇంజక్షన్లు, అదే విధంగా ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశామని, హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే వైద్యం అందించే ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి తో పాటు మరో పెద్ద ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తున్నామని ,భవిష్యత్తులో జిల్లా ప్రజలు ఎలాంటి రోగానికైనా హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వైద్యసేవలు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసుపత్రి ముందు చేపట్టిన పార్కు పనులు తొందరగా పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు .
అనంతరం మంత్రి మున్సిపాలిటీ పరిధిలోని స్వయం ఉపాధి సంఘాలు, నిరుద్యోగ మహిళలకు చేపల ఉత్పత్తులు నిర్వహించేందుకు గాను జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ సహకారంతో 60 శాతం సబ్సిడీపై వాహనాలను మంజూరు చేయగా అట్టి వాహనాన్ని మంత్రి ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాం కిషన్,మెడికిల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.